KTR tweet today: కేంద్రప్రభుత్వం ఐటీఐఆర్ రద్దు చేసినప్పటికీ తెలంగాణ ఐటీ రంగం గత ఎనిమిదేళ్లలో 3.2 రెట్లు వృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిరుడు దేశంలో మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ లోనే వచ్చిందని గుర్తుచేశారు. సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినప్పటికీ దేశంలో 2.5 శాతం జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5 శాతంగా ఉందన్నారు.
ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపు అయిందని, పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయ పెరుగుదల తెలంగాణలోనే అధికమని వివరించారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినప్పటికీ అద్భుత వృద్ధి నమోదు అయిందన్న ఆయన... 20 వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 1.6 మిలియన్ మందికి కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ నిర్మించినట్లు తెలిపారు.