KTR Tweet Today : ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు.. తెలంగాణ మణిహారం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక.. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది క్షణాల్లో తెలంగాణ జలకిరీటంగా భాసిల్లుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నిజలాశయాల్లోకెల్లా.. మల్లన్నసాగర్ అతిపెద్దది. అత్యంత ఎత్తున ఉన్న ఈ మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను కేసీఆర్ మరికొద్ది క్షణాల్లో జాతికి అంకితమివ్వనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదేంటంటే..?
కేంద్రం సాయమెంత?
KTR Tweet on Mallanna Sagar : ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు మరో మైలురాయికి చేరుకుంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నేడు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. "ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు సహకరించిందని మీరు అనుకుంటున్నారు?" అని ట్విటర్‌లో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
అతిపెద్ద జలాశయం..
KTR Tweet on Mallanna Sagar Reservoir : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేసి జలాశయం కలను సాకారం చేశారు.