KTR to Inaugurate Osmansagar park: భాగ్యనగరవాసులకు ఖాళీ సమయాల్లో సేదతీరేందుకు అనువుగా... అందమైన, ఆహ్లాదకర పార్కులను హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. విశ్రాంతి కోసమే కాకుండా సమావేశాలు... వేడుకలు నిర్వహించేందుకు వీలుగా నిర్మిస్తోంది. ఉస్మాన్‌సాగర్ గండిపేట వద్ద సుందరమైన ఉద్యానవనం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఉస్మాన్‌సాగర్ చెరువు ఆనుకుని... ఈ ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జలాశయం అందాలను ఉద్యానవనం నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతి అందించనుంది.
ఉస్మాన్‌సాగర్ వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో 35కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. సుందర జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందు చేయనుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరనుంది. ఎంట్రెన్స్ ప్లాజాతోపాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ క్రాస్ రోడ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు.