KTR opens Flyover: హైదరాబాద్‌లో 8ఏళ్లలో తెరాస ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మరో 17 ఫ్లైఓవర్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. నగరాభివృద్ధికి రహదారులు, ప్రజారవాణా వ్యవస్థే సూచిక అన్న కేటీఆర్... రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తువ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేటీఆర్... అగ్నిపథ్ విషయంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజారవాణ వ్యవస్థే. హైదరాబాద్ ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువుంది. దేశంలో ఔషధాల తయారీ కోసం ఐడీపీఎల్‌ను ఏర్పాటు చేశారు. ఐడీపీఎల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా భూములిచ్చింది. ఐడీపీఎల్ విషయంలో కేసులు వేయండని ఒక కేంద్రమంత్రి అంటున్నారు. మీకు దమ్ముంటే.. నా మీద, రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెట్టండి. ఇంజినీర్లు, సిబ్బంది, కార్మికులపై కేసులు వేయవద్దని కోరుతున్నా. రక్షణశాఖ ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం.'-కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి