తెలంగాణ

telangana

కాకతీయుల కళా సంపదను పరిరక్షిస్తాం: కేటీఆర్‌

KTR: కాకతీయుల కళా సంపదను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాకతీయుల పాలనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరిట 66 వేల చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిందన్నారు. కేటీఆర్‌, కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌తో కలిసి మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

By

Published : Jul 8, 2022, 9:39 AM IST

Published : Jul 8, 2022, 9:39 AM IST

KTR
KTR

KTR: కాకతీయుల విశిష్టతను చాటే కళాసందను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి కె.టి.రామారావు తెలిపారు. కొన్ని చిత్రాలు చూస్తుంటే సంతోషం కలిగిందన్నారు. చాలా మందిరాలు, ప్రాంగణాలు కూలిపోయినా పట్టించుకోని పరిస్థితి మరికొన్ని ఛాయాచిత్రాల్లో కనిపించిందన్నారు. అలాంటి వాటిని చూస్తే బాధ కలుగుతోందని, సిగ్గనిపిస్తోందని అన్నారు. కాకతీయ వైభవ సప్తాహంలో భాగంగా గురువారం రాత్రి మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్య తీసిన 777 ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.

మంత్రి కేటీఆర్‌, కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాకతీయుల పాలనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరిట 66 వేల చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిందన్నారు. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదాను సంపాదించడం మనం సాధించిన అతిగొప్ప విజయాల్లో ఒకటన్నారు. కొన్ని ప్రాంతాల్లో మైనింగ్‌ కారణంగా అక్కడ ఉండే కట్టడాలు, శిల్పాలకు ప్రమాదం ఉందని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ సమావేశంలో మాట్లాడారు. కాకతీయుల చరిత్ర పరిరక్షణకు ప్రభుత్వపరంగా చేపట్టే పనులకు తమ వంతుగా ఆర్థిక సహకారం కూడా అందిస్తామన్నారు. వరంగల్‌, హైదరాబాద్‌లలో తమ పర్యటనకు సంబంధించి విషయాలను పుస్తకాల్లో రాసి వాటిని బస్తర్‌ గ్రంథాలయంలో భద్రపరుస్తామన్నారు. అనంతరం చరిత్ర పరిశోధకుడు అరవింద్‌ ఆర్యను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్‌, రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details