సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కంటోన్మెంటు అభివృద్ధికి సర్కారు ఎన్నో ప్రణాళికలు చేసినప్పటికీ... రక్షణశాఖ పరిమితులతో ముందుకు సాగడం లేదన్నారు. స్కైవేల నిర్మాణం అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, తెరాస ఎంపీలు ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆరోపించారు. కంటోన్మెంటు బోర్డు ఎన్నికలు ఎప్పుడు జరిగినా గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏడాది చివర్లో ఎన్నికలు!
దేశంలోని కంటోన్మెంటు బోర్డులకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున... సికింద్రాబాద్ కంటోన్మెంటుపై తెరాస దృష్టి సారించింది. తెలంగాణ భవన్లో బుధవారం కంటోన్మెంటు ఎమ్మెల్యే సాయన్న, తెరాసకు చెందిన బోర్డు సభ్యులతో కేటీఆర్ సమావేశమయ్యారు. కంటోన్మెంటు బోర్డు పరిధిలో పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఐదేళ్లలో సర్కారు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు... క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్నందున పార్టీ గుర్తుతో ఎన్నికలు జరిగితే ఘనవిజయం సొంతం చేసుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.