తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున 'కోటి వృక్షార్చన'

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ktr released green india challenge one crore plantation program poster
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున 'కోటి వృక్షార్చన'

By

Published : Feb 6, 2021, 7:42 PM IST

Updated : Feb 6, 2021, 8:59 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం సంకల్పానికి మద్ధతుగా ఆ రోజు కోటి మొక్కలు నాటే 'కోటి వృక్షార్చన' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను... మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు సంతోష్ కుమార్, మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఆకుపచ్చ తెలంగాణను ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి ఆశయాలు ప్రతిబించించేలా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు.

ప్రతి గ్రామం యూనిట్‌గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని... పంచాయితీ రాజ్, అటవీశాఖలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కేటీఆర్ కోరారు. కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్, మంత్రులు అభినందించారు. ఆరేళ్ల హరితహారం ఫలితాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని... ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందన్నారు.

రాష్ట్రం, దేశం పచ్చగా మారాలన్న సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు. సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరినీ ప్రత్యేకంగా గుర్తించి, వనమాలి బిరుదు ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన సెల్ఫీ ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్వాహకులు సూచించారు. ఇందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు... వారం రోజుల్లో ఈ-మెయిల్‌కు గానీ మొబైల్‌కు గానీ వస్తుందన్నారు.

ఇదీ చూడండి:ఇల్లందును మోడల్ సిటీగా మార్చేందుకు సహకరిస్తాం: కేటీఆర్

Last Updated : Feb 6, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details