తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2020, 9:47 PM IST

Updated : Aug 12, 2020, 9:57 PM IST

ETV Bharat / city

ఆహారశుద్ధి పరిశ్రమలపై త్వరలో మంత్రివర్గం ముందుకు ముసాయిదా..!

రైతుల ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి, ప్రజలకు కల్తీ లేని ఆహార ఉత్పత్తులే ధ్యేయంగా ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహారశుద్ధి, లాజిస్టిక్ పాలసీలపై చర్చించి మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్​ సమన్వయంలో ప్రగతిభవన్‌లో సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

FOOD
FOOD

ఆహారశుద్ధి పరిశ్రమలపై త్వరలో మంత్రివర్గం ముందుకు ముసాయిదా..!

రెండు పాలసీలపై పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులు, ఆహారశుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాలను వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో జల విప్లవం వస్తోందని, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని తెలిపారు. జలవిప్లవం తోడ్పాటుతో మత్స్య, మాంసం, పాడి, నీలి, గులాబీ, శ్వేత విప్లవాలు రానున్నాయని చెప్పారు.

రాష్ట్రంలోని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పండే పంటలను పూర్తిగా మ్యాపింగ్ చేశామని... రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ వివరించారు. గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం లేదని, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను తక్షణమే ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి ద్వారా రైతుకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు పాలసీలో ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆహారశుద్ధి రంగంలో..

ఆహారశుద్ధి రంగంలో చిన్నయూనిట్లు మొదలు భారీ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉందని... ఈ పరిశ్రమలతో గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని కేటీఆర్ అన్నారు. తద్వారా ప్రజలకు కూడా కల్తీలేని, నాణ్యత గల ఆహార ఉత్పత్తుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ ప్రజెంటేషన్ అనంతరం ఆహారశుద్ధి పాలసీపై మంత్రులు పలు సూచనలు చేశారు. కొన్ని పనులకు కార్మికుల కొరత ఉందని, ఆయా పనుల్లో యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలని.... దళిత, మహిళా పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తెలంగాణ బ్రాండ్..

తెలంగాణ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడాలని, ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని తెలిపారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన వల్ల వృధా తగ్గి రైతుకు లాభం చేకూరుతుందని అన్నారు. మంత్రుల నుంచి పలు సూచనలు, సలహాలు అందాయని... వాటిని పాలసీలో, మార్గదర్శకాల కూర్పులో వినియోగించుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాటన్నింటిని పొందుపరిచి ముసాయిదాను మంత్రివర్గం ముందు ఉంచుతామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Last Updated : Aug 12, 2020, 9:57 PM IST

ABOUT THE AUTHOR

...view details