KTR Tweet Today on Modi : మోదీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్‌లో 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతోందని మండిపడ్డారు. మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అక్కడి సర్కారు రెమిషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని ట్వీట్ చేశారు. ఎంహెచ్‌ఏ ఆర్డర్‌కు వ్యతిరేక చర్యలు అసహ్యంగా ఉంటాయన్న కేటీఆర్.. దేశం పట్ల ప్రధానికున్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.
KTR Tweet Today : తరచూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మోదీ సర్కార్‌పై ట్వీట్ వార్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య అది మరింత ఎక్కువైంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, నిత్యావసర ధరలు, ఈడీ సోదాలు, ఐటీ రైడ్స్, భాజపా నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా మండిపడ్డారు. తాజాగా యూపీలో రేపిస్టులను విడుదల చేయడంపై మంత్రి గళమెత్తారు.
ప్రధాని నరేంద్ర మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. 2047 నాటికి సాధించాల్సిన లక్ష్యాలపై మోదీ మాటలు వినడానికి బాగున్నాయని తెలిపారు. కానీ 2022 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్న హామీ ఏమైందని ట్విటర్లో ప్రశ్నించారు. అలాగే లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ది ప్రధానికి లేదని కేటీఆర్ ప్రస్తావించారు. 2022 నాటికి ప్రతి ఇంటికి విద్యుత్, మంచినీళ్లు, టాయిలెట్ సౌకర్యాలు కల్పిస్తామన్న హామీలపై సమాధానం చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానం నెరవేర్చలేదన్న నిజాన్ని మోదీ గుర్తించాలని కేటీఆర్ ట్విటర్లో నిలదీశారు.
నాడు మహాత్మాగాంధీజీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి "ఆత్మ నిర్భర్" చిహ్నంగా "చరఖా" ఉపయోగిస్తే... ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించిన మొదటి ప్రధానిమంత్రిగా మోదీ గుర్తింపు సాధించారని కేటీఆర్ ఆక్షేపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్‌వేదికగా మంత్రి ఘాటుగా స్పందించారు. ఇదేనా మీరు సాధించిన "ఆత్మ నిర్భర్ భారత్"...? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియచెప్పే స్వదేశీ నినాదం...? అంటూ ఎద్దేవా చేశారు.