రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు ఉదయమే ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, తెరాస సీనియర్ నాయకులు ప్రగతిభవన్‌లో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఇతర పారిశ్రామిక వేత్తలు, చిరంజీవితో పాటు పలువురు సినీనటులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతటా తెరాస శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
మంత్రులు ఈటల, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గంగుల కమలాకర్‌లు కేటీఆర్‌కు మొక్కలను బహుకరించారు. మంత్రి హరీశ్‌రావు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఉపసభాపతి పద్మారావు, ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, జోగినిపల్లి సంతోష్, బీబీ పాటిల్, వెంకటేశ్, కవితలు, శాసనసభ విప్ బాల్క సుమన్, మండలి చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, విప్ కర్నె ప్రభాకర్, శాసనసభ పీయూసీ ఛైర్మన్ జీవన్‌రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కోలేటి దామోదర్ గుప్తా, రాజేశ్ తదితరులు ఆయనను మొక్కలను బహుకరించారు. మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు ఆయనకు అభినందనలు తెలిపారు. కేటీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విజయాలు, పర్యటనలు, పోరాటాల దృశ్యాలతో రూపొందించిన చిత్రాన్ని ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త బహుకరించారు. పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావులు ఆయనను కలిసి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అభ్యర్థించారు. తెలంగాణ ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి మధులు ఆయనను కలిసి క్రమబద్ధీకరణ కోసం కోరారు.
* ఏపీ ప్రజా ప్రతినిధులు క్రీడా, సినిమా, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మ్యాన్, బ్రిటన్ ఉప హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆయనను అభినందించారు.
టీ-కల్చర్ యాప్ ప్రారంభం
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని సమాచారం, కార్యక్రమాలపై తెలంగాణ సమాచార సాంకేతిక సంఘం (టీటా) దేశంలోనే మొదటిసారిగా టి-కల్చర్ పేరుతో రూపొందించిన ప్రత్యేక యాప్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కళల ఖజానా. రాష్ట్రంలో ఎంతో మంది జానపద , గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారులు ఉన్నారు. మధ్యవర్తులకు తావు లేకుండా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కళాకారులకూ ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా ఆన్‌లైన్ ద్వారా గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు దీన్ని రూపొందించామన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలల్లో 15 వేల మొక్కలు
మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 800 ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో సుమారు 15 వేల మొక్కలు నాటినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య సంఘం (టీపీడీపీసీఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్ తెలిపారు. ప్రకృతి సంరక్షణ దినంగా పాటించాలని తాము ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు.