కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పూర్తి స్థాయి సమావేశాలను ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల తొమ్మిదినే జరపాలని నిర్ణయించడంతో రెండు రాష్ట్రాలు హాజరవుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ హాజరు కావాలని నిర్ణయించుకోగా, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల కారణంగా వాయిదా కోరిన తెలంగాణ హాజరువుతుందా లేదా చూడాల్సి ఉంది. నిర్ణీత గడువు ప్రకారం పనులు పూర్తి చేయాల్సి ఉందని, సమయం లేనందున తొమ్మిదో తేదీ సమావేశానికి హాజరుకావాలన్న గోదావరి బోర్డు తరహాలోనే శనివారం కృష్ణా బోర్డు కూడా తెలంగాణకు లేఖ రాసినట్లు తెలిసింది.
సమావేశానికి తెలంగాణ హాజరయ్యే అవకాశం!
బోర్డుల మీటింగుల్లో రాష్ట్ర వైఖరిని గట్టిగా వెల్లడించాలని శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన నేపథ్యంలో.. సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉందనేది ఓ అభిప్రాయం. ఇదే సమయంలో గెజిట్ నోటిఫికేషన్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా కేంద్రానికి లేఖ రాయడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. శనివారం కూడా ముఖ్యమంత్రి నీటిపారుదల అధికారులు, సీనియర్ న్యాయవాదులతో మాట్లాడినట్లు తెలిసింది. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం అక్టోబరు 15లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి బోర్డులు పనిని ప్రారంభించాల్సి ఉంది. అందుకే ఆ తేదీ లోపు ప్రాజెక్టుల్లో సిబ్బంది, ఇతర వివరాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేలా చూడాలన్నది బోర్డుల ప్రయత్నం.