తెలంగాణ

telangana

ETV Bharat / city

KRMB, GRMB: 'గెజిట్​లోని అభ్యంతరాలపై కేంద్రాన్ని సంప్రదించండి'

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కృష్ణా, గోదావరి బోర్డులు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హాజరు కాగా, తెలంగాణ గైర్హాజరైంది. ట్రైబ్యునల్‌, కోర్టు కేసుల కారణంగా సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా గెజిట్‌ నోటిఫికేషన్ల అమలుకు గడువుందంటూ వాయిదా వేయలేదు.

KRMB, GRMB MEETING
KRMB, GRMB MEETING

By

Published : Aug 10, 2021, 5:18 AM IST

గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు మాత్రమే తమ బాధ్యతని, మార్పులు చేర్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు స్పష్టం చేశాయి. ప్రాజెక్టులవారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది తదితర వివరాలు ఇవ్వాలని బోర్డులు కోరగా, నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులో ఏమేం ప్రాజెక్టులు ఉండాలో చర్చించి నిర్ణయిస్తే సమాచారం ఇవ్వడం సులభమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. దీనికి బోర్డు పైవిధంగా సమాధానమిచ్చింది. కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ హాజరు కాగా, తెలంగాణ గైర్హాజరైంది. ట్రైబ్యునల్‌, కోర్టు కేసుల కారణంగా సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరగా గెజిట్‌ నోటిఫికేషన్ల అమలుకు గడువుందంటూ వాయిదా వేయలేదు. సమావేశానికి కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎం.పి.సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌, సభ్య కార్యదర్శులు రాయిపురే, పాండే, సభ్యులు ముతుంగ్‌, కుంట్యాల, వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు నారాయణరెడ్డి, సతీష్‌ హాజరయ్యారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.

కొన్ని ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయి: ఏపీ

నోటిఫికేషన్‌లోని అంశాలను పరిగణనలోకి తీసుకొంటే రాష్ట్రాల నుంచి సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ దిగువ స్థాయిలో ఉన్న సిబ్బందిని మాత్రమే బోర్డులోకి తీసుకోవాల్సి ఉందని, ప్రాజెక్టుల వారీగా సిబ్బంది వివరాలతో పాటు ఔట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న వారి వివరాలూ ఇవ్వాలని బోర్డులు కోరాయి. నోటిఫికేషన్‌లోని షెడ్యూలు-2,3లోని కొన్ని ప్రాజెక్టులపై అభ్యంతరాలున్నాయని, కొన్ని మార్పులు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొనగా, వాటిపై కేంద్రానికి రాయాలని బోర్డులు సూచించాయి. దీనిపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌, ప్రాజెక్టుల్లో పనిచేసే సిబ్బంది వివరాలు వారంలోగా.. యంత్ర సామగ్రి వివరాలను నెలలోగా ఇస్తామని చెప్పింది. నిర్మాణంలో ఉన్న, ఆమోదం లేని ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఇవ్వడం, ఆరునెలల్లోగా అనుమతులు పొందకపోతే నిలిపివేయడంపైనా చర్చ జరిగింది. డీపీఆర్‌లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, పునర్విభజన చట్టంలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని, ఈ మేరకు నోటిఫికేషన్‌లో మార్పు చేయాలని ఏపీ కోరింది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు ఆరునెలల్లో ఆమోదం తెచ్చుకోవాలనడం సరికాదని, ఏ ప్రాజెక్టుకూ ఈ సమయం సరిపోదని పేర్కొంది.

రెండు ప్రభుత్వాలూ సహకరించాలి

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కృష్ణా, గోదావరి బోర్డులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. నోటిఫికేషన్‌లో తమకున్న అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ చెప్పిందని, సీడ్‌ మనీ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపిందని వివరించాయి. సీఐఎస్‌ఎఫ్‌ బలగాల నియామకానికి సంబంధించి జల్‌శక్తి మంత్రిత్వశాఖ ద్వారా హోం మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించాయి.

అన్ని విధాలా సహకరిస్తాం: ఏపీ కార్యదర్శి శ్యామలరావు

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు అన్ని రకాల సహకరిస్తామని బోర్డులకు చెప్పామని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నోటిఫికేషన్‌లోని 2, 3 షెడ్యూళ్లలోని ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని, పునర్విభజన చట్టంలో కొన్ని ప్రాజెక్టులకు రక్షణ కల్పించారని, వీటిగురించి కూడా కేంద్రానికి లేఖరాస్తామన్నారు. నిధులిచ్చే విషయంలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వెళ్తామన్నారు.

బలగాల నియామకానికి అధిక వ్యయం!

గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు అన్ని ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలు నియమించాలంటే అధిక వ్యయమవుతుందని ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు అభిప్రాయపడినట్లు తెలిసింది. వివాదాస్పద ప్రాజెక్టుల వద్ద మాత్రం నియమిస్తే సరిపోతుందన్నట్లు సమాచారం. ఆరునెలల నుంచి ఏడాదిలోగా పూర్తిగా అన్ని అంశాలు పరిష్కారమయ్యేలా చూద్దామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుత్తు విభాగాలను వేరుగా పటిష్ఠం చేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ఒక్కో బోర్డులో ఒక చీఫ్‌ ఇంజినీర్‌ ఉండగా, వీరి కింద ఎస్‌.ఇ, ఇ.ఇ. ఇలా ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపినట్లు సమాచారం.

ఇదీచూడండి:జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details