ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా... దిగువ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. నిన్నరాత్రి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో భారీస్థాయిలో నమోదవుతోంది.
వాగులు పొంగడం
ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తి బ్యారేజ్ నుంచి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు పొంగడం వల్ల కృష్ణా నదిలో అదనంగా కొన్ని వేల క్యూసెక్కుల నీరు కలుస్తోంది. ఆనకట్ట నుంచి నీరు విడుదలవడంతో అప్రమత్తమైన సీతానగరం అధికారులు దిగువకు వెళ్లే మార్గాన్ని మూసివేసి రాకపోకలను మళ్లించారు. నదిఒడ్డున ఉన్న చిగురు బాలల ఆశ్రమం నుంచి 70 మంది బాలలు, సిబ్బందిని విజయవాడకు తరలించారు.
స్నానాలకు వెళ్లరాదు
వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఇంతియాజ్.. ఎస్పీ, సంయుక్త పాలనాధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బ్యారేజ్ దిగువ ప్రాంతవాసులు సురక్షిత స్థలాలకు వెళ్లాలని సూచించారు. కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నదిలో స్నానాలకు వెళ్లరాదని, పశువులను మేతకు తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. నదిలో బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో ప్రయాణించొద్దని స్పష్టం చేశారు.
నిలిచిన రాకపోకలు
నందిగామలో కట్టలేరు ఉద్ధృత ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు రెండు వైపులా కంచె వేయించిన పోలీసులు.. ఎవరూ అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జగ్గయ్యపేట మండలం రావిరాల గ్రామంలో పర్యటించిన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను... ప్రజలకు జాగ్రత్తలను సూచించారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పారు. కృష్ణమ్మకు పసుపు-కుంకుమ సమర్పించారు.