తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల 25న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - krishna water dispute tribunal

ఏపీ, తెలంగాణల మధ్య కొంతకాలంగా తేలకుండా ఉన్న అంశాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈనెల 25న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఎజెండాను బోర్డు.. రెండు రాష్ట్రాలకు పంపింది.

krishna water dispute board, water dispute between telugu states
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం

By

Published : May 15, 2021, 7:49 AM IST

నాలుగు కీలకాంశాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించనుంది. బోర్డుకు అవసరమైన నిధులు విడుదలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య కొంతకాలంగా తేలకుండా ఉన్న అంశాలను ఈ నెల 25న జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండాను బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ పరమేశం, కార్యదర్శి డి.ఎం.రాయపురే, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు రజత్‌కుమార్‌, మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులు శ్యామలరావు, నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు.

బోర్డు నిర్వహణకు అయ్యే ఖర్చును రెండు రాష్ట్రాలు చెరి సగం భరించాల్సి ఉంది. 2020-21లో రూ.8.37 కోట్లకు గాను తెలంగాణ రూ.3.5 కోట్లు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండేళ్లుగా నిధులు రాలేదని ఎజెండాలో పేర్కొన్నారు. 2021-22లో బోర్డు బడ్జెట్‌ రూ.18 కోట్లు కాగా ఇప్పటివరకు ఏ రాష్ట్రం నుంచి విడుదల కాలేదు. సిబ్బంది జీతాలు, టెలిమెట్రీ, వైజాగ్‌కు బోర్డు కార్యాలయం తరలింపు ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో రాష్ట్రం కనీసం రూ.10 కోట్లు విడుదల చేయాలని బోర్డు కోరనుంది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న కొత్త జల సంవత్సరంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై సమావేశంలో చర్చించనున్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50 శాతం చొప్పున వినియోగించుకొనేలా ఉండాలని తెలంగాణ కోరుతోంది.

ఈ నేపథ్యంలో వచ్చే నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుపై నిర్ణయం జరగనుంది. ఒక సంవత్సరంలో కేటాయించి వినియోగించుకోలేని నీటిని తదుపరి సంవత్సరంలో వినియోగించుకొనేందుకు అనుమతించాలని తెలంగాణ కోరుతుండగా, ఆంధ్రప్రదేశ్‌ అంగీకరించడం లేదు. దీనిపై కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బోర్డు ముందుకు మళ్లీ ఈ అంశం రానుంది. వరద వచ్చినపుడు రిజర్వాయర్ల నుంచి మళ్లించే నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ దీనికి అంగీకరించలేదు. ఈ అంశం మళ్లీ బోర్డు ముందుకు చర్చకు వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details