తెలంగాణ

telangana

ETV Bharat / city

Krishna Water Dispute : కృష్ణా బోర్డు సమావేశంలో తెరపైకి మూడు కీలకాంశాలు

తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదం(Krishna Water Dispute)గా ఉన్న పలు కీలకాంశాలను ఈనెల 27న జరగనున్న బోర్డు సమావేశంలో ముందుకు తీసుకురానున్నాయి ఉభయ రాష్ట్రాలు. ఇందులో ముఖ్యంగా క్యారీ ఓవర్, వరద నీటి వినియోగం, నీటి పంపిణి వంటి మూడు అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

కృష్ణా బోర్డు సమావేశంలో తెరపైకి మూడు కీలకాంశాలు
కృష్ణా బోర్డు సమావేశంలో తెరపైకి మూడు కీలకాంశాలు

By

Published : Aug 20, 2021, 8:47 AM IST

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదం(Krishna Water Dispute)గా ఉన్న పలు కీలకాంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండా కానున్నాయి. గత కొన్నినెలలుగా కృష్ణా బేసిన్‌కు సంబంధించిన అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఆరోపణలకు, ఫిర్యాదులకు దారితీశాయి. కేంద్ర జల సంఘం, కృష్ణా బోర్డు గతంలో నిస్సహాయత వ్యక్తం చేశాయి. పరస్పర అంగీకారానికి రావాలని లేదా ట్రైబ్యునల్‌లో తేల్చుకోమని సూచించాయి. ఈ అంశాలతోపాటు కొత్త అంశాలు(Krishna Water Dispute) కూడా ఈనెల 27న జరగనున్న బోర్డు సమావేశం ముందుకు రానున్నాయి. ముఖ్యంగా మూడు విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

క్యారీ ఓవర్‌ :

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నిల్వ ఉండే తమ వాటాను తదుపరి సంవత్సరం వాడుకోవడానికి(క్యారీ ఓవరకు) అనుమతించాలని తెలంగాణ కోరింది. దీనికి అంగీకరించని ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రిజర్వాయర్లలో ఉండే మిగులు లేదా వినియోగించుకోకుండా ఉన్న నీటిని తర్వాత సంవత్సరం రెండు రాష్ట్రాలు పంచుకోవాలని పేర్కొంది. దీనిపై బోర్డు కేంద్ర జల సంఘం అభిప్రాయం అడగ్గా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని లేదా కృష్ణా ట్రైబ్యునల్‌-2 దృష్టికి తీసుకెళ్లాలని చెప్పింది. మళ్లీ కొన్ని అంశాలతో తెలంగాణ లేఖ రాయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో పాత అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. మళ్లీ కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైనందున బోర్డు సమావేశంలో ప్రధానంగా చర్చనీయాంశం కానుంది.

వరద నీటి వినియోగం :

బేసిన్‌లో దిగువన ఉన్న రాష్ట్రంగా మిగులు జలాలను వాడుకొనే అర్హత ఉందని, వరద వచ్చినపుడు ముంపునకు గురయ్యేది తామేనని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. వరద సమయంలో రిజర్వాయర్లన్నీ పూర్తి స్థాయి మట్టాలతో ఉండి గేట్లు ఎత్తి నీటిని వదిలే సమయంలో తీసుకొనే నీటిని రాష్ట్రాల వినియోగం లెక్కలోకి తీసుకోరాదని కోరింది. అయితే ఎవరు ఎంత వాడుకొన్నది లెక్క ఉండాలని తెలంగాణ పేర్కొంది. దీంతో మిగులు జలాల వినియోగంపై కేంద్ర జల సంఘం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఒక సారి పర్యటించడంతోపాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సంబంధించిన 40 సంవత్సరాల నీటి వివరాలు ఇమ్మని కోరింది. రెండు రాష్ట్రాలు ఇవ్వకపోవడంతో కమిటీ ఏమీ చేయలేకపోయింది. పాలేరు, మున్నేరు, పులిచింతల దిగువన వరదతో వచ్చే ప్రవాహాన్ని వినియోగించుకోలేమని, దీన్ని అనివార్యంగా సముద్రంలోకి వెళ్లే నీరుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్‌ నివేదించింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నిండి దిగువకు నీళ్లొదిలినపుడు మళ్లించే నీటిని వరద నియంత్రణలో భాగంగా చూడాలని చెప్పింది. అంతే తప్ప రాష్ట్రం వినియోగించుకొన్న నీటి వాటాగా చూడకూడదని తెలియజేసింది.

2019-20లో వరద సమయంలో తాము 141.76 టీఎంసీలు, తెలంగాణ 36.59 టీఎంసీలు మళ్లించినట్టు తెలిపింది. ఇదే సమయంలో 800 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయంది. రెండు రాష్ట్రాలు వినియోగంచుకోకపోతే 978.35 టీఎంసీలు వెళ్లేవంది. మిగులు జలాల వినియోగంపై బచావత్‌, బ్రిజేష్‌ ట్రైబ్యునళ్లతోపాటు కావేరి, నర్మద ట్రైబ్యునళ్ల తీర్పులను జతచేసింది. అయితే ఎవరెంత నీటిని వినియోగించుకొన్నది లెక్కలుండాలని, మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న వాదన సరైంది కాదని తెలంగాణ పేర్కొంది. ఈ నేపథ్యంలో బోర్డు మళ్లీ ఈ అంశంపై చర్చించనుంది.

నీటి పంపిణీ :

ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనేది 2015-16లో చేసుకొన్న తాత్కాలిక ఏర్పాటు అని కేసీఆర్‌ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో 50 శాతం చొప్పున పంపిణీ చేయాలని కోరింది. బేసిన్‌ను పరిగణనలోకి తీసుకొంటే తెలంగాణకు 700 టీఎంసీలకు పైగా వస్తాయని, ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చే వరకు 50 శాతం చొప్పున ఉండాలని కోరింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటివరకు ఏమీ స్పందించలేదు. బోర్డు సమావేశంలో ఇది ప్రధానాంశం కానుంది. వరద సమయంలో విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని లెక్కలోకి తీసుకోవాలా లేదా, బోర్డు పరిధికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు తదితర ముఖ్యాంశాలు కూడా చర్చకు రానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details