ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలకోసం నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా రెండు టీఎంసీల నీటివిడుదలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు బోర్డు నీటివిడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ జరిగిన బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో జరిగిన నిర్ణయం మేరకు గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీటిని నెలాఖరు వరకు విడుదల చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఉత్తర్వులు జారీ చేశారు.
త్రిసభ్య కమిటీలో..
నెలాఖరుతో నీటి సంవత్సరం ముగుస్తున్నందున అప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం రెండు టీఎంసీల నీరు ఇవ్వాలని.. శుక్రవారం సమావేశమైన త్రిసభ్య కమిటీని ఏపీ కోరింది. ప్రస్తుతం సాగర్‌లో 510 అడుగుల వరకు నీటిని వినియోగిస్తున్నామని, గతంలో అంతకంటె దిగువకు కూడా వెళ్లిన ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. అయితే దిగువకు వెళ్లకుండా తెలంగాణ వాటాలో 49 టీఎంసీల నీరు ఉన్నందున సాగర్ కుడి కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రెండు టీఎంసీల నీరు విడుదల చేసేందుకు కమిటీ అంగీకరించింది. తమ కోటా పూర్తైందంటూ బోర్డు రాసిన లేఖలో పరిపక్వత లేదన్న ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి... తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా నీటి నష్టాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.