కృష్ణానదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశం... నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో నేడు జరగనుంది. తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డితోపాటు బోర్టు సభ్య కార్యదర్శి మువాంతాంగ్, ఇతర సభ్యులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు. రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రులు దిశానిర్ధేశం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విషయంలో వాదనలు బలంగా వినిపించాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాలని సూచించారు.
పరస్పర ఫిర్యాదులు
శ్రీశైలం జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల ప్రతిపాదన, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా నిలువరించాలని కోరుతూ తెలంగాణ... అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టిందంటూ ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని రెండు రాష్ట్రాలకు బోర్డు స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కూడా త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.