ఏపీలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లో భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలున్నట్టు తేలింది. ఏకంగా 0.56 నుంచి 7.68 లక్షల కోట్ల ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ మేర ఉండొచ్చని అంచనా. ఇక్కడ లభ్యమయ్యే మీథేన్... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని అఘార్కర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఏఆర్ఐ) శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కేజీ బేసిన్‌లో భారీగా మీథేన్ హైడ్రేట్ నిల్వలున్నట్టు తేలింది. ఈ పరిశోధన వివరాలు "మెరైన్ జీనోమిక్స్" అనే పత్రికలో ప్రచురితమయ్యాయి. మీథేన్ పర్యావరణ అనుకూల ఇంధనం. దీని దహన ప్రక్రియలో హానికారక ఉద్గారాలు పెద్దగా వెలువడవు. ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు రెండు నీటి అణువులు, ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు విడుదలవుతాయి. ఆర్థిక కోణంలోనూ ప్రయోజనకరమే.
కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఇంధన నిల్వలపై ఇటీవల పరిశోధనలు చేసినప్పుడు... అక్కడ జీవ మూలాలున్న మీథేన్ హైడ్రేట్ నిల్వలను కనుగొన్నట్టు కేంద్రం ప్రకటించింది. శిలాజ ఇంధన వనరులు అంతరించిపోతున్నందున తరుణంలో ప్రత్యామ్నాయ శుద్ధ ఇంధనం వైపు చూస్తున్న ప్రపంచానికి ఇది శుభవార్తేనని కేంద్రం పేర్కొంది. ఆ నిల్వల నుంచి తగినంతగా మీథేన్ వాయువును సరఫరా చేయొచ్చంది. మెథనోజెన్‌లు అనే సూక్ష్మజీవులు ఈ బయోజెనిక్ మీథేన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని.... అది మీథేన్ హైడ్రేట్‌గా అందుబాటులో ఉంటోందని తెలిపింది. ఒక క్యూబిక్ మీటర్ మీథేన్ హైడ్రేట్‌లో 160-180 క్యూబిక్ మీటర్ల మీథేన్ ఉండొచ్చని అంచనా. ఈ లెక్కన ఇక్కడ లభ్యమయ్యే మీథేన్... ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శిలాజ ఇంధన నిక్షేపాలకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని ఏఆర్ఐ అధ్యయనం పేర్కొంది.
కృష్ణా- గోదావరి బేసిన్‌లో ఒత్తిడి, ఉష్ణోగ్రతలు మెథనోజెన్‌లకు అనుకూలంగా ఉన్నాయని ఏఆర్ఐ వివరించింది. అండమాన్ తీరం, మహానది వద్ద సైతం ఈ నిక్షేపాలు ఉన్నాయని పేర్కొంది. అయితే వాటితో పోలిస్తే కేజీ బేసిన్‌లో మెథనోజెనిక్ వైవిధ్యత అధికంగా ఉందని వివరించింది. దీనిపై తదుపరి అధ్యయనాలు నిర్వహించాలని సూచించింది.
ఇదీ చదవండి:నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు