Lease farmers declare crop holiday: కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలాల్లో ‘ఈటీవీ భారత్ -ఈనాడు’బృందం పరిశీలించింది. రైతులు, కౌలుదారులు, కూలీలతో మాట్లాడింది. ఏటా నష్టాలతో విసిగిపోయామని, ఈసారి తొలి పంట వదిలేస్తున్నామని స్పష్టంచేశారు. వర్షాలు తగ్గాక రబీలో వరి వేస్తే కొంతైనా గట్టెక్కుతామని అంటున్నారు. సొంత భూమి ఉండి సాగు చేసుకుంటున్న వారితో పోల్చితే తామే ఎక్కువగా నష్టపోతున్నామంటూ కౌలుదారులు తమ అనుభవాలను ఏకరవు పెట్టారు. అందుకే జూన్ 1న డెల్టాలో కాల్వలకు నీళ్లొదిలినా ఇప్పటికీ ఆకు మడులు సిద్ధం చేయడం లేదు.
గోదావరి ప్రాంత రైతులు అధిక వర్షాలతో మూడేళ్లుగా నష్టపోతున్నారు. ఏటా రెండు, మూడుసార్లు పొలాలు ముంపునకు గురువుతున్నాయి. గతేడాది నారు మడి దశలోనే వర్షాలు ముంచేశాయి. కొందరు మళ్లీ నారు పోయగా, మరికొందరు దూరప్రాంతాల నుంచి కొనుక్కొచ్చి నాట్లు వేయడం వల్ల ఖర్చు పెరిగింది. నాట్లు పడ్డాక మూణ్నాలుగు వారాల్లో వర్షాలు కురవడంతో వారానికి పైగా నీరు నిలిచి పంట కుళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. మిగిలిన పంటను కాపాడుకునేందుకు ఎరువులు, పురుగు మందుల పిచికారీకి 2 వేల నుంచి 3వేలు అదనంగా ఖర్చు చేశారు.
కోతల సమయంలోనూ వర్షాలతో పంట నేల వాలిపోవడం, మొలకలు రావడం, హార్వెస్టర్, ట్రాక్టర్లకు కిరాయిలు చెల్లించడం భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి ఆశిస్తుంటే.. 20 బస్తాలైనా రావడం లేదంటున్నారు. పండించిన ధాన్యంలో తేమ తగ్గించేందుకు కళ్లాల్లో ఆరబెట్టినప్పుడు వానలు కురిసి నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ 75 కిలోల బస్తాకు వ్యాపారులు 11వందల నుంచి 12 వందల మధ్యే చెల్లిస్తున్నారు.