Tension at Amalapuram: ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.
సెక్షన్ 144, 30 పోలీస్ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
'కోనసీమ ముద్దు - వేరే పేరు వద్దు' అనే నినాదంతో కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళకారులు అన్ని వైపుల నుంచి పట్టణంలోకి చొచ్చుకొచ్చారు. బస్టాండ్‌తో పాటు ముమ్మిడివరం వైపు నుంచి గడియారం స్తంభం వద్దకు ప్రదర్శనగా చేరుకున్నారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు యత్నించారు. లాఠీలతో చెదరగొట్టారు. అయినా నిరసనకారులు వెనకడుగు వెయ్యలేదు. సమయం గడిచేకొద్దీ వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
పోలీసులకు ముచ్చెమటలు...నిరసనకారులు క్షణక్షణానికీ తమ వ్యూహాలు మారుస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించిన ఆందోళనకారులు మధ్యాహ్నం దాకా స్తబ్దుగా ఉండి ఒక్కసారిగా వివిధ మార్గాల నుంచి వేలాదిగా రహదారులపైకి వచ్చారు.
*మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి వేల మంది యువత ప్రదర్శనగా గడియార స్తంభం కూడలికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారులను నిలువరించేందుకు కొందరు పోలీసులు లాఠీఛార్జికి దిగారు. గడియార స్తంభం కూడలి నుంచి నల్లవంతెన.. అక్కడి నుంచి కలెక్టరేట్ వైపు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపించింది. మంగళవారం రాత్రి అమలాపురం చేరుకున్న... ఏలూరు రేంజీ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కోనసీమకు అదనపు బలగాల్ని రప్పించారు.
మంటల్లో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలు:ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తరలించడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలపై పలువురు దాడికి దిగారు. కలెక్టరేట్ ఆవరణలో ఆందోళనకారులను తరలించేందుకు తెచ్చిన ప్రైవేటు కళాశాల బస్సును ధ్వంసం చేసి.. నిప్పంటించారు. కొందరు కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. మరోవైపు ఎర్రవంతెన దగ్గర పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు. అమలాపురంలో ఎస్బీఐ కాలనీలో మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయం, నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి నిప్పంటించారు. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్.. మంత్రి డౌన్ డౌన్.. జై కోనసీమ.. జైజై కోనసీమ అంటూ నినదించారు. మంత్రి భార్య, పిల్లలను ఆందోళనకారులు వచ్చేకంటే ముందే పోలీసులు సురక్షితంగా వేరే వాహనంలో పంపించారు. అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ నివాసం దగ్గరకు చేరుకున్న ఆందోళనకారులు రాళ్లు రువ్వి.. ధ్వంసం చేసి నిప్పంటించారు. అక్కడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో సతీష్ కుమార్, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిని రక్షించే క్రమంలో పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మరోవైపు భట్నవిల్లిలో నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు.
సంఘ విద్రోహ శక్తుల పనే..: అంబేడ్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమనిహోంమంత్రి తానేటి వనిత అన్నారు. జిల్లా ప్రజల అభీష్టం మేరకే జిల్లా పేరు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడం జరిగిందన్నారు. సంఘ విద్రోహ శక్తులు అల్లర్లను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఘటనపై విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. రాళ్ల దాడి ఘటనలో 20 మంది పోలీసులు గాయపడ్డారన్నారు. పోలీసులపై దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. -తానేటి వనిత, హోంమంత్రి
కోనసీమ జిల్లా పేరును ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ రెవెన్యూశాఖ ఇటీవల ప్రాథమిక ప్రకటన జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను 30 రోజుల్లోగా కలెక్టర్‌కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో కోనసీమ పేరునే కొనసాగించాలంటూ యువకులు ఆందోళనకు దిగారు.
మేం ఉగ్రవాదులం కాదు...:ఆందోళనను నిలువరించేందుకు పోలీసులు నల్లవంతెనపై రహదారికి అడ్డంగా లారీలు, ట్రాక్టర్లను పెట్టారు. అడ్డు తొలగించకపోవడంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేమేమీ ఉగ్రవాదులం, మావోయిస్టులం కాదు.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే అభ్యంతరాలను తెలిపేందుకు కలెక్టరేట్‌కు వెళుతున్నామనీ, ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: