తెలంగాణ

telangana

ETV Bharat / city

రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి - కాంగ్రెస్​ పార్టీలో ముసలం

Komatireddy Venkat Reddy Comments కాంగ్రెస్​ పార్టీలో ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో మొదలైన కాక ఇప్పుడు ఆయన సోదరుడు వెంకట్​రెడ్డికి తగులుతోంది. తమ్ముడి బాటలోనే అన్న కూడా నడుస్తాడేమోనన్న అనుమానమో పార్టీలోని కీలక వ్యక్తులకు ముందు నుంచి పడకపోవటమో ఆయనను పక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నింటిపై గుర్రుగా ఉన్న వెంకట్​రెడ్డి మాత్రం రాహుల్​గాంధీ దగ్గరనే తేల్చుకుంటానని చెబుతున్నారు.

Komatireddy Venkat Reddy sensational Comments on state congress leadership
Komatireddy Venkat Reddy sensational Comments on state congress leadership

By

Published : Aug 12, 2022, 4:40 PM IST

Komatireddy Venkat Reddy Comments: కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య కోల్డ్​ వార్​ కొనసాగుతోంది. తమ్ముడు రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో మారిన సమీకరణాలతో.. వెంకట్​రెడ్డి కూడా అదే బాటలోనే నడుస్తాడేమోనన్న అనుమానంతో అధిష్ఠానం ఆయనను పక్కకుపెట్టినట్టు కనిపిస్తోంది. రేపు నారాయణపూర్​ నుంచి చౌటుప్పల్​ వరకు సాగనున్న పాదయాత్రకు పిలుపు రాకపోవటం.. మునుగోడు ఉపఎన్నికల మీటింగ్​ గురించి సమాచారం లేకపోవటం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే.. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. తనను పట్టించుకోకపోవటం.. చండూరు సభలో తనకు జరిగిన అవమానంపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పీకలదాకాా కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్​ చేసిన"పార్టీలో ప్రాంఛైజీ రాజకీయం"ఆరోపణలను ఉటంకిస్తూ.. అధిష్ఠానంపై ఉన్న అక్కసును మీడియా ముందు వెళ్లగక్కారు. చండూరు సభలో జరిగిన అవమానాన్ని సీరియస్​గా తీసుకున్న వెంకట్​రెడ్డి.. నాయకత్వం నుంచి ఎలాంటి బుజ్జగింపు లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. సభల గురించి సమాచారం లేకపోవటం.. సభల్లో తిట్టినా పట్టించుకోకపోవటం.. తిట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవటంపై అక్కస్సు వెళ్లగక్కుతున్న వెంకట్​రెడ్డి.. ఈ పరిణామాలన్నింటి వెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఉన్నట్టు పరోక్షంగా ఆరోపిస్తున్నారు. అయితే.. వీళ్లిద్దరి మధ్య గతంలోనే బేధాభిప్రాయాలున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ వరుస ఘటనలతో వారి మధ్య అంతర్గత వైరం మరింత ముదురుతున్నట్టు అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.

పాదయాత్ర గురించి గాంధీభవన్​ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదంటున్న కోమటిరెడ్డి.. పిలవని పేరంటానికి తాను వెళ్లనని తెగేసి చెబుతున్నారు. తనకు జరిగిన అవమానంపై సంబంధిత నాయకత్వం క్షమాపణలు చెబితేనే.. ప్రచారంలో పాల్గొనటంపై ఆలోచిస్తానంటున్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలపై నేరుగా దిల్లీ వెళ్లి రాహుల్​గాంధీ వద్దనే తేల్చుకుంటానని చెబుతున్నారు.

"మునుగోడు ఉపఎన్నికల మీటింగ్ సమాచారం నాకు లేదు. పిలువని పేరంటానికి నేను వెళ్లను. మునుగోడు గురించి నాకు ఏం తెల్వదు. మేము కానిస్టేబుళ్లమని అవమానించారు. మమ్మల్ని అవనించిన వారు క్షమాపణ చెప్పాలి. ఐఎఎస్​లు ఉన్నప్పుడు మాతో ఏం పని.. వాళ్లే గెలిపించుకుంటారు. రేపటి కాంగ్రెస్ పాదయాత్రకు కూడా నన్ను ఎవరూ పిలువలేదు. చండూరు సభలో ఓ కార్యకర్తతో నన్ను తిట్టించారు. అక్కడే అతన్ని లాగిపెట్టి కొట్టాల్సింది. నాలాంటి సీనియర్​ను తిట్టిన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. తిట్టించిన వాళ్లు క్షమాపణ చెప్పాలి. అప్పుడు మాత్రమే అక్కడ ప్రచారంపై ఆలోచన చేస్తా. దాసోజు శ్రవణ్​ చెప్పినట్టు.. పార్టీలో ప్రాంఛైజీ నడుస్తోంది. ఈ విషయమై దిల్లీలో రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటా." - కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details