Komatireddy VenkatReddy on Party Change Allegations: తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజకీయ అభిప్రాయంతో తనకు సంబంధంలేదని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఆయన ఉద్దేశం చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలు చేయవద్దని కోరారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసినట్లు కోమటి రెడ్డి తెలిపారు. వారిని కలిసినంత అంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయటం సరైంది కాదని హితవు పలికారు. దిల్లీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి.. మీడియాతో మాట్లాడారు.
విభేదాలు సహజం
ఏ ఇంట్లో అయినా గొడవలు ఉంటాయని.. అలాంటప్పుడు పార్టీలో విభేదాలు ఉండటం సహజమేనని కోమటిరెడ్డి అన్నారు. భాజపా, తెరాసలో అంతకంటే ఎక్కువ గొడవలు ఉన్నాయని వెల్లడించారు. పార్టీ బాగుకోసం అందరం సమష్టిగా సాగాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా కృషి చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
"అభివృద్ధి కోసమే ప్రధాని, మంత్రులను కలిశాను. ప్రధానిని కలిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా సోదరుడు రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయాలతో నాకు సంబంధంలేదు. ఒకే ఇంట్లోనే ఎన్నో గొడవలు ఉంటాయి. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉండటం సహజం. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తాం." -కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇదీ చదవండి:కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలకు కేంద్రం సహకరిస్తోంది: రేవంత్ రెడ్డి