తిరుమల శ్రీవారి ఆలయం(tirumala Srivari Temple)లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమంజనంలో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలంతో ప్రదక్షణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
Tirumala Temple : శ్రీవారి సన్నిధిలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - ttd updates
తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Temple)లో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని తితిదే అధికారులు నిర్వహిస్తున్నారు. తిరుమంజనంలో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేస్తున్నందున మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. గురువారం ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలో(Tirumala Temple)ని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరుస్తున్నారు. 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం సమర్పించిన తర్వాత... మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఈవో జవహార్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు అర్చకులు తితిదే సిబ్బంది పాల్గొన్నారు.