koil alwar thirumanjanam at Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహించింది. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పసువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర జలంతో ప్రదక్షణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహించారు.
వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు
అనంతరం స్వామివారికి కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం సమర్పించిన తర్వాత.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు అర్చకులు, తితిదే సిబ్బంది పాల్గొన్నారు. వైకుంఠం ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఏఈవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం అద్దె గదుల కేటాయింపు నిలిపివేస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.