Kodandaram: తెరాస ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉరివేసి.. ప్రైవేటు యూనివర్సిటీలకు హారతి పడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీల భర్తీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెజస కార్యాలయంలో రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
'గ్రూప్-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తేయడం సరికాదు. గ్రూప్-1 కు సంబంధించిన విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకోకుండా... కొన్ని విషయాలను టీఎస్పీఎస్సీకి వదిలివేయాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజావ్యతిరేకమైనవి. జీవో 111 ఎత్తివేతతో పాతబస్తీకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. దానిపై పాతబస్తీలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. జంట జలాశయాలు, మూసీ గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.'