Kishan Reddy Comments on CM KCR: మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడు, పోరాట యోధుడు తెరాసలో లేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చండూరులో రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటలో కలిపివేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ పదాన్ని తొలిగించారని వ్యాఖ్యానించారు.
ఎంత డబ్బు, మద్యం పంచినా ప్రజలు భాజపానే గెలిపిస్తారు: కిషన్‌రెడ్డి 'రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంట కలిపేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తెలంగాణ పదాన్ని తొలిగించారు. అహంకారాన్ని దెబ్బతీయడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంత డబ్బు, మద్యం పంచినా ప్రజలు భాజపానే గెలిపిస్తారు.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
తెరాస దోపిడీ దుకాణం బంద్ అవుతుంది..హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. మునుగోడులో హుజూరాబాద్ ఫలితమే వస్తుందని ఈటల స్పష్టం చేశారు. తెరాస పార్టీ పుట్టక ముందే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ అన్న ఈటల.. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం భాజపాలో చేరారని తెరాస నేతలు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు.
మునుగోడు ఉపఎన్నికతో తెరాస దోపిడీ దుకాణం బంద్ అవుతుందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రచారంలో భాగంగా ప్రతి వాడకు, పల్లెకు వెళ్తామని చెప్పారు. ఎవరు వచ్చి ఏం చెప్పినా కాషాయం మాత్రమే గుండెల్లో ఉండాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈటల కోరారు.
Rajagopal Reddy nomination: మునుగోడు ఉపఎన్నిక రోజురోజుకు వేడెక్కుతోంది. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ నాయకత్వం ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీగా తరలివచ్చిన అగ్రనాయకత్వం, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కోమటిరెడ్డి ర్యాలీగా బయలుదేరారు. బంగారి గడ్డ నుంచి ఆర్వో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
కోమటిరెడ్డి వెంట తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, వెంకటస్వామి, మనోహర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. సాయంత్రం ప్రచార వ్యూహంపై భాజపా నేతల సమావేశం ఉంటుంది. పార్టీ అగ్రనేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ మండల ఇంఛార్జులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారం ముగిసేవరకు పార్టీ ఇంఛార్జులు నియోజకవర్గం దాటి వెళ్లకూడదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రకటించారు.
ఇవీ చదవండి: