కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి(KISHAN REDDY) బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ట్రాన్స్పోర్ట్ భవన్‌లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి(KISHAN REDDY) బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రులు మీనాక్షి లేఖి, అజయ్ భట్ పాల్గొన్నారు. అనంతరం.. శాస్త్రి భవన్‌లో సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
నమ్మకం నిలబెట్టుకుంటా..
పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు కిషన్ రెడ్డికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలను కట్టబెట్టారు. కేబినెట్లో తనకు చోటు కల్పించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని.. ప్రధానికి తనపై ఉన్న నమ్మకాన్ని నిలబట్టుకుంటానని చెప్పారు. తనను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు మరోసారి.. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
చిత్తశుద్ధితో పనిచేస్తా..
ఇప్పటి వరకు సహాయమంత్రిగా పలు చట్టాలు చేయటంలో భాగస్వామ్యమయ్యాను. ఇప్పుడు కేబినెట్ మంత్రిగా అంతే చిత్తశుద్ధితో కృషి చేస్తా. 1980 నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలు నెరవేర్చాను. అప్పడు సాధారణ కార్యకర్తగా ఎలా పనిచేశానో.. ఇప్పుడు కూడా అంతే సేవాభావంతో పనిచేస్తాను. నేను ఈ స్థాయికి రావటానికి కారణమైన... నన్ను గెలిపించిన సికింద్రాబాద్ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇది మరుపురాని సంఘటన."