ఆ ప్రాంతంలో నిత్యావసర సరకులు తెచ్చుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పోవాల్సిందే. కిలోమీటర్ల కొద్ది ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. చిన్న వంతెన నిర్మిస్తే తమ బతుకులు మారుతాయంటున్నారు గిరిపుత్రులు.
ఏపీలోని విశాఖ ఏజెన్సీ సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాడేరు మన్యంలో ముఖ్యంగా పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లోని శివారు గ్రామాలకు వెళ్లాలంటే ఏరులు ఈదుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే.
అగ్గిపెట్టె తెచ్చుకోవాలన్న ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ఇక్కడ గిరిజనులకు కావాల్సింది చిన్న వంతెన మాత్రమే. కోడి మామిడి గెడ్డ అవతల ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల గిరి పల్లెలు ఉన్నాయి. ఆంధ్రాలో జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన గ్రామాల గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారానికోసారి సమీపంలో మద్దిగరువు సంతకు వెళ్తారు.