ఆదివాసీ, బంజారా ఆత్మీయసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్... గిరిజన రిజర్వేషన్లపై కీలకమైన ప్రకటన చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను పదిశాతానికి పెంచుతూ వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులతోపాటు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లు తీసుకొచ్చింది.
గతంలోనే ఉభయసభల్లో ఆమోదం: ముస్లిం మైనార్టీలకు 12శాతం, గిరిజనులను పది శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ ఈ బిల్లు రూపొందించారు. బీసీ-ఈ కేటగిరీ కింద ముస్లిం మైనార్టీలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను 12శాతానికి, గిరిజనులకు అమలు అవుతున్న 6శాతం రిజర్వేషన్లను 10శాతానికి పెంచారు. ఆ బిల్లు ప్రకారం రాష్ట్రంలో బలహీన వర్గాలకు 37శాతం రిజర్వేషన్లు ఉంటాయి. A గ్రూప్ వారికి 7శాతం, Bగ్రూప్‌లో 10శాతం, Cగ్రూప్ కింద 1 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. D గ్రూప్‌లో 7శాతం, E గ్రూప్‌లో 12శాతం రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు ఉన్న 15శాతం రిజర్వేషన్లు ఎలాంటి మార్పులు లేకుండా యధాతథంగా ఉంటాయి. మొత్తం రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని 50నుంచి 62కు పెంచుతూ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం కూడా పొందింది. 2017 ఏప్రిల్ 16వ తేదీన రిజర్వేషన్ల పెంపు బిల్లు శాసనసభ, మండలిలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపారు.
నాలుగేళ్లుగా పెండింగ్: రిజర్వేషన్ల శాతం 50 శాతాన్ని దాటుతుండడంతో తమిళనాడు తరహాలో బిల్లును తొమ్మిదో షెడ్యూళ్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనూ రిజర్వేషన్ల పెంపు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ఆటంకాలు లేవని... రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఉండబోవని వివరించారు. గడచిన నాలుగేళ్లుగా ఆ బిల్లు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉంది.