KCR Hat trick as CM: కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఖాయమని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్, భాజపా సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని కేటీఆర్ వివరించారు. నేతల మధ్య గొడవలు తెరాసలో పోటీతత్వాన్ని చాటుతున్నాయన్న కేటీఆర్.. బలంగా ఉన్న నాయకులను పార్టీ కలుపుకొని పోతుందన్నారు. తెరాస ఒక్క పార్టీయే రాష్ట్రం అంతటా ఉందన్నారు. 90కి పైగా స్థానాలు వస్తాయని తెరాస సర్వే చెబుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. కొత్త రేషన్‌కార్డులు, కొత్త పెన్షన్లు కూడా ఇస్తామన్నారు.
'సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. వాళ్ల సర్వేలే స్పష్టం చేస్తున్నాయి' - తెలంగాణ సీఎంపై కేటీఆర్ వ్యాఖ్యలు
12:54 July 15
ఎనిమిదేళ్ల పాలన తర్వాతా ప్రజల నుంచి మంచి స్పందన: కేటీఆర్
"కేసీఆర్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ ఖాయం. కాంగ్రెస్, భాజపా సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల పాలన తర్వాతా ప్రజల నుంచి మంచి స్పందన ఉందంటే కేసీఆర్, తెరాసకు ఉన్న ఆదరణకు నిదర్శనం. తెరాస ఒక్క పార్టీయే రాష్ట్రం అంతటా ఉంది. 90కి పైగా స్థానాలు వస్తాయని మా సర్వే చెబుతోంది. కేసీఆర్ ఎవరికీ బెదరడు, లొంగడు. భాజపా డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీనే అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మంచి పనులతో మనసులు గెలవడం భాజపాకు తెలియదన్నారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు." - కేటీఆర్, మంత్రి
వరద పరిస్థితిలో ఉంటే ఉపాధిహామీలో అక్రమాలు అంటూ కేంద్రం బృందాలను పంపిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం ఉన్న ప్రధాని అయితే వరదలు వచ్చినపుడు ముందస్తు సాయం అందించాలన్నారు. అలాంటిది హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. గుజరాత్‌కు మాత్రం ఇప్పటికే వెయ్యి కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని మండిపడ్డారు. శత్రు దేశాలపై ఆర్థిక ఆంక్షలు పెట్టినట్లు రాష్ట్రానికి అప్పుల విషయంలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులపై కేంద్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మోదీ.. దేశానికి కాదు గుజరాత్‌కు మాత్రమే ప్రధానమంత్రి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి:తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్