National Dalit Conference: హైదరాబాద్‌లో త్వరలో భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జాతీయ దళిత సదస్సు నిర్వహిస్తామని, దేశవ్యాప్తంగా ఉన్న దళిత నేతలు, ఉద్యమకారులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని, ఇదే స్పూర్తితో దేశవ్యాప్తంగా వాటిని అమలు చేసేలా భారాస చొరవ తీసుకుంటుందన్నారు.
జాతీయ పార్టీ ప్రకటించి వచ్చిన తర్వాత ప్రగతిభవన్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు కేసీఆర్‌ను కలిశారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన శాసనమండలి పక్ష నేత బోజేగౌడ, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాలకిషన్‌రావు, మాజీ మంత్రి రేవణ్ణ, ఎమ్మెల్యే సురేశ్‌గౌడ, కుమారస్వామి కుమారుడు నిఖిల్‌గౌడ, విదుతాళై చిరుత్తాగళ్‌కట్చె (వీసీకే) అధినేత, ఎంపీ తిరుమావళవన్ నేతృత్వంలో వీసీకే కార్యదర్శి బాలసింగం, ఏపీ అధ్యక్షుడు ఎన్‌జే విద్యాసాగర్, న్యాయ విభాగం నేత నర్సింహమూర్తి, జాతీయ రైతు నేతలు గుర్నాం సింగ్, అక్షయ్‌కుమార్(ఒడిశా); మాణిక్‌కదమ్, దశరథ్‌సావంత్(మహారాష్ట్ర), ఆకాశ్‌యాదవ్, కున్వర్‌సింగ్(హరియాణా), ద్రవిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు వంటెల కృష్ణారావు తదితరులు ఆయన్ను ఘనంగా సన్మానించారు.