పండ్లు, కూరగాయలు, పూలు, నూనెగింజలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. వివిధ రంగాల తరహాలోనే ఉద్యాన పంటల సాగులోనూ దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూణ్నెళ్లలోగా రాష్ట్ర సమగ్ర ఉద్యాన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలు తీర్చడం సహా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా ఉద్యాన పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని.. అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల్లో ఉద్యానపంటల మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులు, నిపుణులతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సంబంధిత అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఉద్యానవన పంటల విషయంలోనూ సమగ్ర దృక్పథం ఏర్పరచుకోవాలని ఆకాంక్షించారు.
మనమే ఎగుమతి చేసేలా..
రాష్ట్ర వాతావరణం, రైతుల నైపుణ్యం... తోటల సాగుకు ఎంతో అనుకూలమన్న సీఎం.. సానుకూలతలు ఉండి కూడా ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు, మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి పోయి ఉద్యాన పంటల్లో తెలంగాణ.. స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మన అవసరాలు తీర్చడం సహా వివిధ రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేసేలా ఎదగాలని.. ఆ దిశగా ఉద్యాన శాఖ సమాయత్తం కావాలని సూచించారు.
గుణాత్మక మార్పే లక్ష్యం..
రైతులను చైతన్య పరిచి, ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యాన పంటలు సాగు చేయగలుగుతామో నిర్ణయించి అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే ధ్యేయంగా సమగ్ర ఉద్యానవన పంటల విధానాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రానికి అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లో రూపొందించాలని, ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని ఆదేశించారు.