కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం సుదీర్ఘంగా సాగింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా సమీక్షించారు. ఇప్పటివరకు నమోదైన కేసులతో పాటుగా స్క్రీనింగ్ పరీక్షలు, క్వారంటైన్, ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలపై చర్చించారు. జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్రంలో 18 చెక్‌పోస్టులు..
విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి విమానం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో వస్తున్న వారితోనే సమస్య తలెత్తుతోందన్నారు. కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా వ్యక్తుల ఉదంతమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 18 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష
సినిమా హాళ్లు, పబ్‌లు, క్లబ్బుల మూసివేతను నెలాఖరు వరకు పొడిగించారు. పెళ్లి మండపాలను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను కూడా రద్దు చేశారు. షబ్బే మెరాజ్ సందర్భంగా కూడా సభలు నిర్వహించరాదని ముస్లిం సంఘాలకు తెలిపారు. ప్రజల స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అన్న సీఎం... వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.