KCR National Party: కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినా.. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాలకుపైగా గడువు ఉన్నందున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.
KCR National Party: రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే కొత్త జాతీయ పార్టీ..! - కొత్త జాతీయ పార్టీ
KCR National Party: కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ గురించి ఇటు రాష్ట్రం అటు దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచే విభిన్న రకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అనధికారికంగా.. పార్టీ పేరు సైతం ప్రచారంలోకి వచ్చేసింది. అయితే.. అధికారంగా పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది.
ఈ నెల 10న ప్రగతిభవన్‌లో శాసనసభాపతి, మండలి ఛైర్మన్, మంత్రులు, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు, శాసనసభ, మండలి పార్టీ విప్‌లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. కొత్త జాతీయ పార్టీ ఆలోచన గురించి చెప్పారు. ఈ నెల 19న తెరాస కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు. దీనికి అనుగుణంగా పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సైతం సంప్రదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా ఉన్నందున కొత్త జాతీయ పార్టీని తర్వాత ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో చర్చించి, మద్దతుపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
జాతీయ మీడియా ప్రముఖులతో చర్చ..:కొత్త జాతీయ పార్టీ సన్నాహాల్లో భాగంగా కేసీఆర్ దేశంలోని ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విశ్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో చర్చలు నిర్వహిస్తున్నారు. గురువారం దిల్లీకి చెందిన ఆర్థిక నిపుణుల బృందంతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. శుక్రవారం జాతీయ మీడియా ప్రముఖులతో చర్చించారు. వచ్చేనెల రెండోవారం వరకు ఈ చర్చలు కొనసాగనున్నట్లు తెలిసింది.