KCR About National Politics : దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ తన సత్తా చూపిస్తారా? దేశానికి కావాల్సింది నేషనల్ ఫ్రంట్ కాదంటూనే.. జాతీయ పార్టీ పెట్టే యోచనలో సీఎం ఉన్నారా? తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారా? తెరాస 21వ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత ఇవన్నీ నిజమేనని అనిపిస్తోంది. దాదాపు గంటన్నరపాటు జరిగిన కేసీఆర్ ప్రసంగంలో ఎక్కువ భాగం.. దేశ రాజకీయాలపైనే మాట్లాడటం త్వరలోనే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయం అనడానికి ఊతమిస్తోంది.
తెరాస 21వ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత ప్రసంగం.. పార్టీ గత విజయాలు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ కంటే.. దేశ రాజకీయాలు.. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయం వంటి అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్లు కనిపించింది. ఓవైపు దేశానికి కావాల్సింది.. రాజకీయ ఫ్రంట్‌లు కాదంటూనేే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిలాగే.. భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయనడం త్వరలోనే దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయనడానికి నిదర్శనంలా కనిపిస్తున్నాయి. దేశ ప్రజల అభివృద్ధికి కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలంటూనే.. భారత్ బాగుపడటానికి తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమనడం.. హైదరాబాద్ వేదికగా దేశరాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారనే ఆలోచనకు బలం చేకూరుస్తోంది.
భారత రాష్ట్ర సమితి:దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదని.. దేశ గతి, స్థితిని మార్చే.. ప్రజల అభివృద్ధికి సహకరించే ప్రత్యామ్నాయ అజెండా కావాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశం బాగు కోసం తెలంగాణ నుంచి అడుగులు పడితే అది రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. భారతదేశం వద్ద తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని.. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రగతి జరిగి తీరుతుందని తేల్చి చెప్పారు. భారత్ దేశంలో ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితి కావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలని వ్యాఖ్యానించారు.
ఆకలి కేకలెందుకు :దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారని కేసీఆర్ తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారని చెప్పారు. కానీ దానికి తాను వ్యతిరేకించానని వెల్లడించారు. దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలని అన్నారు. 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలెందుకున్నాయని ప్రశ్నించారు.