కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాలు ఆధ్యాత్మికతో కళకళలాడాయి. వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయాన్ని మహిళలు లక్ష దీపాలతో చూడ ముచ్చటగా అలంకరించారు. మహబూబాబాద్‌లోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, దీపాలు వెలిగించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం నిర్వహించారు. ధర్మగుండాన్ని దీపాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివనామస్మరణ చేశారు. వెలిచాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిత్యకళ్యాణం అనంతరం సహస్ర దీపాలంకరణ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో చేసిన సహస్ర దీపాలంకరణ ఎంతగానో ఆకట్టుకుంది.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో భక్తులు నెలరోజులుగా చేపట్టిన కార్తిక మాసదీక్షలను విరమించారు. ముగింపు రోజున గ్రామంలో కార్తికేయ స్వామి పల్లకి ఊరేగించారు. శివారులోని వాగులో కాగడ వదిలి ప్రత్యేక హారతిచ్చారు. నిర్మల్ గండి రామన్న శివాలయంలో సాయి దీక్ష సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు 11,116 దీపాలు వెలిగించారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంజీరా నది ఒడ్డున దీపాలంకరణ చేశారు.