న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్..
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్...
కార్తికమాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
దీపం... దైవ స్వరూపం....
కార్తికమాసం...పరమ పవిత్రం....
అనంత పుణ్యఫలం...దీపప్రజ్వలనం...
ప్రమిదలోని వత్తిని శరీరంగానూ, జ్వాలను ప్రాణంగా, నూనెను కర్మ ఫలంగానూ పండితులు చెబుతారు. కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని దీని అర్థం. అంటే మనం చేసే పనిని బట్టే.. మన రాత మారుతుంది. లోకంలోని సర్వ జనులు సుఖంగా ఉండాలనేదే.. అన్ని శాస్త్రాలు, ఆచారాల మూల సిద్ధాంతం.
కార్తికమాసం...పరమ పవిత్రం... ప్రమిదలో వత్తి సత్వగుణానికి, నూనె తమోగుణానికి, మంట సత్వగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు. కానీ మూడు కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస, రజోగుణాలని అణచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని పెంచుకోవాలి. ఉత్తమ సాంగత్యం వల్ల ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వగుణం పెరుగుతుంది.
కార్తిక దీపాలు పెడుతున్న మహిళలు దీపాలను బయట వెలిగించడమే కాదు హృదయాలలోనూ వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు ప్రకాశవంతంగా వెలుగుతాయి. రాగద్వేషాలకు అతీతమైన స్వభావాన్ని పెంచుకుని సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికీ ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో... ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి