కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి... భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోదావరి ఒడ్డున.. కార్తిక శోభ
పెద్దపెల్లి జిల్లా మంథనిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి... దీపాలను వదులుతున్నారు. నదిఒడ్డున ఉన్న ఉసిరి చెట్టు వద్ద వత్తులు వెలిగించి ప్రదక్షిణలు చేస్తున్నారు.
రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం
ములుగు జిల్లా రామప్ప దేవాలయంలో రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. హన్మకొండ వేయి స్థంభాల ఆలయనికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు దీపాలు వెలిగించి రుద్రేశ్వరుణ్ణి దర్శించుకొన్నారు
గోపాలకృష్ణ మఠంలో కాగడ హారతి
కార్తిక మాసం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ప్రసిద్ధ గోపాలకృష్ణ మఠంలో నెలరోజుల పాటు కాగడ హారతి నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భక్తులు మంగళహారతులతో మఠానికి చేరుకొని పూజలు చేశారు. నెయ్యిలో నాన్చిన వత్తులను వెలిగించి స్వామివారిని మేల్కొలిపే ఘట్టం కాగడ హారతిలోని ప్రత్యేకత. మహారాష్ట్రలోని ప్రసిద్ధ పండరీపురం క్షేత్రం తరహాలో నిర్వహిస్తారు.
కంఠేశ్వరునికి కార్తిక దీపం
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో కార్తిక శోభ సంతరించుకుంది. భద్రాచలం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఏడాది మొత్తం దీపాలు వెలిగించలేని వారు... కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. నది ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కూసుమంచి గణపేశ్వరాలయంలో ప్రత్యేక అభిషేక, అర్చనలతో కార్తిక శోభ సంతరించుకుంది. మణుగూరు నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇల్లందు శివాలయంలో కార్తిక దీపాలు వెలిగించి పిల్లలు, పెద్దలు పూజల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ కంఠేశ్వర శివాలయనికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో దీపారాధన చేస్తూ... ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేస్తున్నారు.
శివాలయాలకు కార్తిక వైభవం
మేడ్చల్ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు స్వామిని దర్శించుకొని దీపారాధన చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల రామలింగేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.