తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంచార పశువైద్యశాల పనితీరు, టోల్‌ఫ్రీ నంబరు-1962 సేవలు అద్భుతంగా ఉన్నాయని కర్ణాటక పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చవాన్(karnataka minister prabhu prises telangana scheme) ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో గోశాల సందర్శించిన మంత్రి... సంచార పశువైద్యశాలల పనితీరును పరిశీలించారు. అధ్యయనం నిమిత్తం మంత్రి నేతృత్వంలో కర్ణాటక బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా... హైదరాబాద్ మాసబ్‌ట్యాంకు పశుసంక్షేమ భవన్‌లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు(karnataka minister prabhu chauhan met talasani srinivas yadav). పాడి రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతు చెంతకే వెళ్లి అందిస్తున్న పశు వైద్య సేవలు బాగున్నాయని... రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ స్ఫూర్తితోనే..
"దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ స్ఫూర్తితో కర్ణాటకలో జనాభా దృష్ట్యా... పాడి, మాంసం ఉత్పత్తులు పెంపొందించేందుకు రైతులకు నాణ్యమైన సేవలందించేందుకు 1962 సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం 15 జిల్లాల్లో పశుసంజీవని పేరిట ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో మిగతా జిల్లాల్లోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక సంచార వైద్యశాల అందుబాటులోకి తీసుకొస్తాం. గోసంరక్షణ కేంద్రాలు సహా పశువులన్నింటికీ కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. రైతు ఫోన్ చేస్తే సంచార వైద్యశాల ఇంటి ముంగిటకే వచ్చేలా 27X7 సేవలందిస్తాం." - ప్రభు బీ చౌహాన్, కర్ణాటక మంత్రి
కర్ణాటకకు సహకారం ఉంటుంది..
"వ్యవసాయ అనుబంధ పాడి రంగం బలోపేతం, రైతాంగం అభ్యున్నతి కోసంపశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఉచిత చేప పిల్లల పంపిణీ వంటి పథకాల వల్ల మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించాం. పాడి రంగం అభివృద్ధి, రైతుల ఆదాయాల పెంపు విషయంలో తెలంగాణ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి ఎల్లప్పుడు సహాయ సహకారాలు ఉంటాయి. రాజకీయాలకు అతీతంగా రైతాంగం అభివృద్ధి విషయంలో ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది." - తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర మంత్రి