KANUMA: తెలుగునేలపై అతి పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలు ముక్కనుమతో ముగుస్తాయి. ఇంటినిండా బంధువులు.. వారికి కొసరి కొసరి వడ్డించే ఇల్లాలు.. కొత్త అల్లుళ్లను మురిపెంగా చూసుకొనే మామలు.. బావల్ని ఆటపట్టించే కొంటె మరదళ్లు.. ఓణీల్లో వయ్యారాలు ఒలకబోసే యువతులు.. కొత్త దుస్తులను చూసి మురిసిపోయే చిన్నారులు.. భూదేవికి సారె ఇచ్చినట్లు దారిపొడవునా పరచుకునే అందమైన రంగవల్లులు.. వాటిలో ముచ్చటగా ఒదిగిపోయే గొబ్బెమ్మలు... ఇలా మూడ్రోజుల పాటు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు ముక్కనుమతో ముగుస్తాయి.
పశువుల పూజ..
భోగి మంటలతో మొదలై.. మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంలో ఉజ్వలమై కనుమ రోజున కలిమిని అందిస్తూ బలిమిగా మారిన పశువులను పూజించడం ద్వారా మూడురోజుల మహాసంబరం ముగుస్తుంది. కనుమ పర్వదినాన పశువులను పూజించడం ఆనవాయితీ. పశువుల్ని అందంగా అలంకరించి.. శరీరమంతా పసుపు- కుంకుమ పూసి ఊరేగిస్తారు. మెడలో మువ్వలపట్టీలు కట్టి కొమ్ములకు ప్రత్యేకంగా రూపొందించిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ పెడతారు. పశువులకు హారతులిచ్చి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు.
ఈ రోజు ప్రయాణాలు చేయరు..
కనుమనాడు మాంసాహారం తినడం సంప్రదాయం. మినుములతో గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో పరిపాటి. కనుమనాడు ప్రయాణాలు చేయకుండా చూసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో పశువులకు ఉప్పు చెక్క తినిపిస్తారు. వివిధ మూలికలను ముద్దగా చేసి.. పశువులకు తినిపిస్తే రోగాలు రావని రైతుల నమ్మకం. పశువుల మందలు అభివృద్ధి చెందితే.. వచ్చే పండక్కి పొట్టేలు, కోడిని ఇస్తామని మొక్కుకుంటారు. ఇంటికి వచ్చిన బంధువులకు పశువుల్ని పరిచయం చేస్తూ శుభాకాంక్షలు చెప్పిస్తారు.