తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నెపల్లి పంపుహౌస్‌కు రూ.వెయ్యి కోట్ల నష్టం !..అన్నారం అందుకే మునిగిందా ? - కన్నెపల్లి పంప్ హౌస్ న్యూస్

Kannepally pump house: గత నెల వర్షాలు, వరదల కారణంగా నీట మునిగిన కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్‌లో వరద జలాలు తోడేయడం పూర్తయింది. తాజా దృశ్యాలు చూస్తే.. వరదల తీవ్రతకు భారీగానే నష్టం వాటిల్లినట్లు వెల్లడవుతోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు డిజైన్‌లో చేసిన మార్పు వల్లే అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కన్నెపల్లి పంపుహౌస్‌
కన్నెపల్లి పంపుహౌస్‌

By

Published : Aug 12, 2022, 5:48 AM IST

Kannepally pump house: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి (లక్ష్మి) పంపుహౌస్‌కు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దెబ్బతిన్న మోటార్లు, ఇతర పరికరాల నష్టం సుమారు రూ.వెయ్యికోట్ల వరకు ఉండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మోటార్లన్నింటినీ పూర్తి స్థాయిలో పరిశీలించాకే తుది అంచనాకు రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని ఎత్తిపోసేందుకు జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కన్నెపల్లి వద్ద పంపుహౌస్‌ నిర్మించారు. మొదట రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంలో 11పంపులు, మోటార్లు ఏర్పాటు చేశారు.

తర్వాత మూడో టీఎంసీ కోసం మరో 6పంపులు, మోటార్లను అమర్చారు. గత నెలలో వచ్చిన భారీవరదకు పంపుహౌస్‌ మునగగా, నీటిని తోడటం ప్రారంభించాక ఇప్పుడిప్పుడే పంపుహౌస్‌కు, మోటార్లకు జరిగిన నష్టం వెలుగులోకి వస్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం 12 నుంచి 17వ మోటారు వరకు పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిసింది. ఈ 6 కొత్తగా అదనపు టీఎంసీకి ఏర్పాటు చేసిన మోటార్లని సమాచారం. మిగిలిన వాటిలో రెండింటికి మరమ్మతు చేయాల్సి వస్తుందని, 9 మోటార్లకు ఇబ్బంది లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పంపుహౌస్‌ మునిగిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లోకి అధికారులు ఎవరినీ పోనివ్వలేదు. తాజాగా కొన్ని ఫొటోలు వెలుగులోకి రావడంతో పంపుహౌస్‌కు జరిగిన తీవ్రనష్టం తెలిసింది.

కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని 17 బాహుబలి మోటార్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల కాంతుల్లో మెరిసిపోయేవి. వరదఉద్ధృతికి వాటి రూపురేఖలు మారిపోయాయి. పంపుహౌస్‌ అంతా దెబ్బతిన్న మోటార్లు, పడిపోయిన రక్షణగోడల శిథిలాలు, విరిగిన ఈవోటీ క్రేన్లు, కేబుళ్లు, చిందరవందరగా పడిన సామగ్రితో ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. కొన్ని మోటార్లు స్థానభ్రంశం కావడంతోపాటు వాటి పైభాగంలో ఉండే సాఫ్ట్‌లు దెబ్బతిన్నాయి.

కొనసాగుతున్న పనులు..:నీటిని తోడి మోటార్లు బయట పడిన తర్వాత బురద, ఇతర శకలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 500 మంది వరకు పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా ఆరు మోటార్ల కొనుగోలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఆస్ట్రియా, ఫిన్లాండ్‌ దేశాల నుంచి ఇంజినీరింగ్‌ నిపుణులు వస్తున్నట్లు సమాచారం. వారు రాగానే మోటార్ల పనితీరును పరిశీలించనున్నారు. నష్టానికి సంబంధించిన అంచనా కూడా తేలే అవకాశం ఉంది. ఈవోటీ క్రేన్లు, లిఫ్టుల భాగాలను పూర్తిస్థాయిలో తొలగించలేదు. ప్యానెల్‌ బోర్డుల తీగలను పరిశీలించారు. 60 శాతం వరకు తీగలు ధ్వంసం కాగా 40 శాతం వరకు పనిచేస్తాయని తెలిసింది. పంపుహౌస్‌కు ముందు భాగంలోని ఫోర్‌బే వద్ద నీటిని, వరదను తోడి శుభ్రపరిచారు.

డిజైన్‌ మారిందా?:డిజైన్‌లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్‌ మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం) మొదట ఆమోదించిన డిజైన్‌ ప్రకారం 132 మీటర్లు. అంటే అంతవరకు కాంక్రీటు పని చేయాలి. తర్వాత మార్పు చేసి 124 మీటర్లకు తగ్గించారు. దీంతోపాటు మోటార్లు, స్విచ్‌గేర్‌లు ఇలా అన్నింటి మెయింటెనెన్స్‌ బేల మట్టాలు తగ్గిపోయాయి. మొదట ఆమోదించింది, తర్వాత మార్చి ఆమోదించింది కూడా జెన్‌కోనే. పంపుహౌస్‌ నిర్మాణం కావడంతో సివిల్‌ పనులతో సహా అన్నింటికి సంబంధించిన డిజైన్లను జెన్‌కోనే ఆమోదించిందని, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఆమోదానికి వెళ్లలేదని తెలిసింది. వారి పరిశీలనకు వెళ్లినా, అసలు కాంక్రీటు పనిని ఎనిమిది మీటర్లు ఎందుకు తగ్గించారన్న అంశాన్ని ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

.

132 మీటర్లయితే పంపుహౌస్‌కు రక్షణ ఉండేదోమో...:అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన పంపుహౌస్‌ సివిల్‌ పనుల డిజైన్‌కు మొదట 2016 నవంబరు 4న జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదం తెలిపారు. ఇందులో మెయింటెనెన్స్‌ బే 132 మీటర్లుగా ఉంది. దీనిపై కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ కూడా సంతకం చేశారు. దీనికి తగ్గట్లుగానే తవ్వకం చేపట్టినా, 2018 జూన్‌ 15న మళ్లీ మార్పు చేశారు. దాని ప్రకారం మెయింటెనెన్స్‌ బే 124 మీటర్లకు తగ్గిపోయింది. అంటే కాంక్రీటు పని అంత వరకు చేస్తే సరిపోతుంది. దీంతోపాటు పంపులు అమర్చే ఫ్లోర్‌, మొదటి స్విచ్‌గేర్‌ రూం, రెండో స్విచ్‌గేర్‌ రూం మట్టాలను కూడా మార్చారు. ఈ మార్పులకన్నా మెయింటెనెన్స్‌ బే మట్టాన్ని తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుందిళ్ల బ్యారేజికి 1.8 కిలోమీటర్ల దూరంలో అన్నారం పంపుహౌస్‌ ఉంది. సుందిళ్ల బ్యారేజి వద్ద అత్యధిక వరద మట్టం(హెచ్‌.ఎఫ్‌.ఎల్‌) 132.13 మీటర్లు కాగా, అన్నారం వద్ద 121 మీటర్లు. వీటిని పరిగణనలోకి తీసుకొనే రెండు బ్యారేజీల పూర్తి స్థాయి నీటిమట్టాలను నిర్ధారించారు. పంపుహౌస్‌కు సమీపంలో ఉన్న చందనాపూర్‌ వాగు హెచ్‌.ఎఫ్‌.ఎల్‌. 124.5 మీటర్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట ఆమోదం తెలిపినట్లుగా 132 మీటర్ల వరకు కాంక్రీటు పని చేసి ఉంటే పంపుహౌస్‌కు రక్షణ ఉండేదోమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో అత్యధిక వరద వచ్చినపుడు సుందిళ్ల వద్ద నమోదైన మట్టం 130.6 మీటర్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంటే హెచ్‌.ఎఫ్‌.ఎల్‌. పూర్తిగా రాలేదు. వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నదానిపై కూడా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details