తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటినుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు - కానిపాకం వరసిద్ధి వినాయక

కాణిపాక వరసిద్ధి వినాయకుడు బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాడు. గణేశ్‌చతుర్థి నుంచి మొదలుకుని 21 రోజులపాటు కన్నుల పండువగా జరిగే గణనాయకుడి బ్రహ్మోత్సవాలకు... అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాల ధగధగలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల వసతులు ఏర్పాటుచేశారు.

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

By

Published : Sep 2, 2019, 7:36 AM IST

నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

ముల్లోకాలకు అధిపతిగా పూజలందుకుంటున్న విఘ్న వినాయకుని పవిత్ర పుణ్యక్షేత్రం..... కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. 21 రోజుల పాటు వైభవంగా సాగే ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకున్న అధికార గణం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

21వ సంఖ్య ఎంతో ప్రీతిపాత్రం..

కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. పూర్వ కాలం నుంచి స్వామి వారి ఆలయాన్ని కాణిపాకం సహా చుట్టు పక్కల 14 గ్రామాల ప్రజలు పూజలు చేసుకునేవారు. అనాది కాలంగా వీరి ఆధ్వర్యంలోనే కాణిపాకం ఆలయం దినదినాభివృద్ధి సాధించింది. ప్రత్యేకించి స్వామి వారికి 21 సంఖ్య ప్రీతిపాత్రమైనది కావటం...14 గ్రామాల్లోని 21 ప్రధాన కులాలకు చెందిన స్వామి వారి భక్తులు ఏలుబడిలో ఆలయం ఉండటంతో నాటి నుంచి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించంట ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరగుతాయి. ప్రతి రోజూ ఉదయం అభిషేకం రాత్రికి హంస, నెమలి, మూషిక, పెద్ద శేష, వృషభ, గజ, అశ్వ, రావణబ్రహ్మ,యాలి ఇలా ఒక్కో రోజూ ఒక్కో వాహనంపై ఊరేగుతూ గణపతి భక్తులకు వరప్రసాదం చేయనున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు...

వినాయక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆలయం మొత్తాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అదనంగా బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేయటంతో పాటు ఆలయ పరిసరప్రాంతాల్లో వసతి సౌకర్యాలను మెరుగుపర్చారు. ఉచిత అన్న ప్రసాదం, అదనంగా లడ్డూల తయారీపైనా అధికారులు దృష్టి సారించారు. దారిపొడవునా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వరసిద్ధి వినాయకుని ఎక్కువ మంది దర్శించునేలా ఏర్పాట్లు భారీ ఎత్తున చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

చేసే పనిలో..ప్రారంభించే కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా అభయమొసగే గణనాథుడు వరసిద్ధి వినాయకుడి వైభవోత్సవాలు ఘనంగా నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఇటు అధికారులు, అటు పోలీసులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నారు.

ఇవీ చూడండి: వేడుకలకు సిద్ధమైన ఖైరతాబాద్‌ గణేషుడు

ABOUT THE AUTHOR

...view details