ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సత్తి భాస్కరరెడ్డి 60 ఏళ్ల కిందట నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఓ మోతుబరి రైతు వద్ద 11 ఏళ్లకే పనిలో చేరారు. పనిచేస్తూనే వ్యవసాయంలో మెళకువలు నేర్చుకున్నారు. పెళ్లైన తర్వాత బతుకుదెరువు కోసం 1977లో కడియం మండలం దుళ్ల గ్రామానికి వలస వచ్చారు భాస్కరరెడ్డి. రెండెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని కంద పంట వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికంగా కంద పండిస్తూ... మంచి లాభాలు గడిస్తున్నారు. దాదాపు 42 ఏళ్లుగా... ప్రధానంగా కంద పంటనే పండించడం వల్ల ఆయనకు కందరెడ్డి అనే పేరు స్థిరపడింది.
సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తితో రూ.2 లక్షల వ్యయంతో తన ఇంటి వద్దే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాటన్ పురస్కారాల పేరిట ఏటా ఉత్తమ ఉపాధ్యాయుడు, వైద్యుడు, రైతు, ఇంజినీర్ పేరిట సన్మానం చేసి అవార్డులు ప్రదానం చేస్తారు. ఆదాయంలో 50శాతం ప్రజాసేవకు వెచ్చిస్తారు కందరెడ్డి. పేదలను ఆదుకోవడం, పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పార్కుల అభివృద్ధికి విరాళాలు ఇస్తారు. పంచాయతీలకు ట్రాక్టర్లు, పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు. నిరుపేద విద్యార్థులను దత్తత తీసుకొని చదువుల ఖర్చులు భరిస్తున్నారు.
కందరెడ్డి సేవలు గుర్తించి అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ... 2018లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇప్పటి వరకూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో దాదాపు 200 పురస్కారాలు అందుకున్నారు కందరెడ్డి.