తెలంగాణ

telangana

ETV Bharat / city

యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ కంబళ క్రీడ - కంబళ ప్రత్యేకత

క్రికెట్, ఫుట్‌బాల్‌ టోర్నీలతో సమానంగా ఆదరణ.. ఏడాదిపాటు దున్నపోతులు, పరుగువీరులకు శిక్షణ.... గెలిస్తే ఆటగాళ్లు, యజమానులకు వచ్చే పేరు అంతా ఇంతా కాదు. వీటన్నింటికి చిరునామే...కంబళ. ఆ గ్రామీణ క్రీడే ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తోంది. ప్రపంచ రికార్డులను కంబళ వీరులు అవలీలగా అధిగమిస్తుండడమే అందుకు కారణం. ఘనమైన వారసత్వ చరిత్ర గల కంబళ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.

kambala that is traditional buffalo race in karnataka
kambala that is traditional buffalo race in karnataka

By

Published : Apr 2, 2021, 4:30 PM IST

యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్న సంప్రదాయ క్రీడ... కంబళ..

కంబళ... కర్ణాటకకు చెందిన ఓ సంప్రదాయ క్రీడ ఇది. పొలంలో దున్నల మధ్య నిర్వహించే పరుగు పందెమే కంబళ. రాష్ట్రంలోని తీరప్రాంతాల రైతులు.. ఏడాదిలో రెండో పంట దిగుబడి తర్వాత.. బురద నిండిన పొలాల్లో దున్నలను పరిగెత్తిస్తారు. ఇది పురాతన కాలం నుంచీ సంప్రదాయంగా కొనసాగుతోంది.

ప్రాచీన కాలంలో....ఆరోగ్యంగా ఉన్న దున్నలను..పొలాల్లో పరిగెత్తించేవారు. క్రమంగా చుట్టు పక్కల రైతులకు చెందిన దున్నలకు మధ్య పోటీలు నిర్వహించడం మొదలుపెట్టారు. కాల క్రమంలో ఈ పోటీలు..కుటుంబాల గౌరవానికి, మర్యాదకు ప్రతీకగా మారాయి. కంబళలో రెండు రకాలుంటాయి. సంప్రదాయ కంబళ ఓ రకమైతే...కంబళ పోటీలు మరోరకం.

1970ల తర్వాత కంబళ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న కంబళ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న ఆట. ఈ పోటీల కోసం పొలాల్లో గానీ, మైదానాల్లో గానీ కృత్రిమంగా కుంట తయారుచేస్తారు. లోపల ఇసుక జల్లి, పోటీ కోసం సిద్ధం చేస్తారు. ఒక్కో కుంట 15 నుంచి 20 అడుగుల వెడల్పు, 130 నుంచి 150 మీటర్ల పొడవు ఉంటుంది.

కంబళలో కనెహలగే, సీనియర్, అడ్డహలగే, నాగలి, జూనియర్ అని 5 విభాగాలుంటాయి. కనెహలగేలో ప్రత్యేకంగా చేసిన గుండ్రటి మొద్దుపై పోటీదారుడు ఒంటికాలితో నిలబడతాడు. ఆ మొద్దుకు 2కన్నాలుంటాయి. దున్నలు పరిగెత్తే సమయంలో వాటి గుండా కుంటలోని బురదనీరు బలంగా ప్రవహిస్తుంది. ఈ విభాగంలో కన్నాల గుండా నీరు ప్రవహించే ఎత్తు బట్టి, విజేతను నిర్ణయిస్తారు. నీరు ఎంత వేగంగా కన్నాల గుండా ప్రసరిస్తుందో అంత ఎత్తుకు ఎగిసి పడుతుందన్నమాట. సామాన్య ప్రేక్షకులు ఆ తేడాను గుర్తించేందుకు వీలుగా తెల్లని నూలు జెండాలు ఏర్పాటుచేస్తారు.

హగ్గా హిరియా విభాగంలో 2 దున్నలను కలుపుతూ తాడు కడతారు. ఈ పోటీల్లో సీనియర్ దున్నలు పాల్గొంటాయి. పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉన్నందున వీటి వేగం ఎక్కువే. దున్నల పక్కన పోటీదారుడు తాడుకు ఉన్న ముడుల్ని ఆసరాగా చేసుకుని వాటితోపాటు పరిగెడతాడు. దీంట్లో జూనియర్, సీనియర్ లెవెల్స్ ఉంటాయి. అడ్డహలగే విభాగంలో దున్నల జంటకు ఓ కొయ్యమొద్దు కడతారు. దానిపై పోటీదారుడు నిలబడాల్సి ఉంటుంది. బురద నీటికి సమాంతరంగా ఈ కొయ్య ఉండేలా ఏర్పాటు చేస్తారు. దీనిలో సీనియర్ కేటగిరీ మాత్రమే ఉంది.

నాగలి విభాగంలో రన్నర్ నాగలిని మోసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది పొలం దున్నడానికి వాడే నాగలి కాదు. పోటీల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇప్పుడిప్పుడే పోటీల్లోకి ప్రవేశిస్తున్న దున్నలను ఈ విభాగంలో పరిగెత్తిస్తారు. ఈ రేసులోనూ జూనియర్, సీనియర్ విభాగాలున్నాయి. ఇక జూనియర్ విభాగంలో మొదట్లో చిన్న దున్నలను పోటీల్లో దింపేవారు. అన్నింటినీ ఒకతాటిపై నిలబెట్టి, పరిగెత్తిస్తారు. వేగం బట్టి విజేతను నిర్ణయిస్తారు.

కంబళలో పాల్గొనే దున్నలను యజమానులు సకల సౌకర్యాలు కల్పించి, సాకుతారు. వాటికోసం స్విమ్మింగ్ పూల్, దోమ తెరలు, పంకా లాంటి సదుపాయాలు కల్పిస్తారు. ఖర్బూజా, కూరగాయలు, నువ్వుల నూనె, కొబ్బరి నూనెను భోజనంగా పెడతారు. కన్నబిడ్డల్లాగా వాటిని కాపాడుకుంటారు యజమానులు. ఏదేమైనా...పోటీల్లో దున్నలకు ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇదీ చూడండి: కుర్చీల పల్లకీలో ఊరేగించారు.. గురుభక్తిని చాటుకున్నారు..!

ABOUT THE AUTHOR

...view details