బ్రహ్మోత్సవాల మూడో రోజున సోమవారం ఉదయం సింహవాహనంపై యోగనరసింహుడి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి అమ్మవార్లతో కలసి కాళీయమర్థన చిన్నికృష్ణుడి అవతారంలో కటాక్షించారు. శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా కల్యాణ మండపానికి స్వామివారు రాగా ... అక్కడ కొలువుదీర్చిన వాహన సేవలపై విశేష తిరువాభరణాలు, పరిమళభరిత పూలమాలలతో అలంకృతులయ్యారు. మంగళవాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో విశేషంగా నిర్వహించే స్నపనతిరుమంజనాన్ని జీయంగార్ల సమక్షంలో అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు కంకణభట్టార్ గోవిందాచార్యులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని చేశారు. పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.