పనుల్లో విపరీత జాప్యం ఘనమైన లక్ష్యానికి విఘాతంగా పరిణమిస్తోంది. సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్న సంకల్పం ఇప్పట్లో సిద్ధించేట్టు లేదు. సింగూరు, నిజాంసాగర్ జలాశయాల్లోకి నీటిని మళ్లించే కీలకమైన పనులూ నత్తనడకన సాగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనుల పరిస్థితి ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కన్నట్లుగా ఉంది. ఇదే రీతిలో కొనసాగితే పూర్తికావడానికి కనీసం మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.
మల్లన్నసాగర్ నుంచి 113 కి.మీ. దూరంలో ఉన్న సింగూరుకు నీటిని మళ్లించడం, మార్గమధ్యలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, ప్రధాన కాలువ 27వ కి.మీ. నుంచి హల్దియా వాగు ద్వారా 2,927 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్‌కు మళ్లించే పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు. మొదట 2009లో, తర్వాత మార్పులు చేసి 2017లో గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం 28 ప్యాకేజీలుగా విభజించగా, మల్లన్నసాగర్ నుంచి సింగూరు వరకు నీటిని మళ్లించడానికి 17, 18, 19 ప్యాకేజీలుగా చేపట్టారు. మల్లన్నసాగర్ నుంచి ఏడు కిలోమీటర్ల తర్వాత ఇవి ప్రారంభమవుతాయి.
17వ ప్యాకేజీ.. మల్లన్నసాగర్ నుంచి 5,791 క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు 18.6 కిలోమీటర్ల దూరం తొమ్మిది మీటర్ల వ్యాసంతో సొరంగం, 4.5 కి.మీ. కాలువ తవ్వాల్సి ఉంది. 2017 అక్టోబరులో రూ.986 కోట్లతో ఐటీడీ సిమెంటేషన్ సంస్థతో ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు 2.8 కి.మీ దూరం సొరంగమార్గం మాత్రమే పూర్తయింది. మొత్తమ్మీద 21 శాతం పని జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పనిని ఓ ప్రజాప్రతినిధికి చెందిన సంస్థ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో లక్ష్యం ప్రకారం చేయాలని ఇంజినీర్లు ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని తెలిసింది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకొని వేగం పెంచాలని ఒత్తిడి చేయడంతో నెలకు 400 మీటర్ల పనిని పూర్తి చేస్తున్నట్లు సమాచారం. మరో రెండేళ్లు గడువు పొడిగించడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ ప్యాకేజి కింద ఆయకట్టు లేదు.