తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కిమిడి కళా వెంకటరావును ఏపీలోని విజయనగరం జిల్లా పోలీసులు.. బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులోనే కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజాం పట్టణంలోకి రాత్రి 8 గంటల తర్వాత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి.. కళా వెంకటరావు నివాసాన్ని చుట్టుముట్టారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలిస్తుండగా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన ఏం తప్పు చేశారని తీసుకెళుతున్నారని నిలదీశారు. రామతీర్థం ఘటనలో అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను బలవంతంగా పోలీసు జీపులోకి నెట్టేశారు. ఆ తర్వాత విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 9.45 గంటలకు ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు.