తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్‌ విమానానికి బాంబు బెదిరింపు - Bomb threat to Hyderabad flight

విమానంలో సీటు దక్కలేదన్న కోపంతో ప్లేన్​లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్​ చేసి చెప్పాడో యువకుడు. అప్రమత్తమైన పోలీసులు ప్రయాణికులను దింపి విమానాన్ని బాంబ్ స్వ్కాడ్​తో క్షుణ్ణంగా పరిశీలించారు. తప్పుడు సమాచారం అని పసిగట్టిన పోలీసులు ఆ యువకుణ్ని కనిపెట్టి అరెస్టు చేశారు.

aeroplane, bomb threat to flight, Hyderabad airport
విమానం, బాంబు బెదిరింపు, అలయన్స్‌ ఎయిర్‌ విమానం

By

Published : Mar 29, 2021, 7:25 AM IST

కాకినాడకు చెందిన ఓ యువకుడు విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరించి అరెస్టైన సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. విమానంలో సీటు దొరకలేదన్న కోపంతోనే అతడు ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. నాసిక్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌ వెంకటనారాయణ మూర్తి(33) శనివారం రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరాల్సిన అలయన్స్‌ ఎయిర్‌ విమానానికి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే పీఎన్‌ఆర్‌ వివరాలు అప్డేట్‌ కాకపోవడంతో ఆరా తీయడానికి విమానాశ్రయానికి చేరుకున్నాడు. మరో టికెట్‌ తీసుకోవాలని సిబ్బంది సూచించారు. గర్భిణి అయిన భార్యను చూసేందుకు త్వరగా వెళ్లాలని భావించిన వీరేశ్‌ అక్కడి సిబ్బందితో గొడవపడ్డాడు. అయినా సీటు ఇచ్చేందుకు నిరాకరించడంతో విమానాశ్రయం నుంచి వెనుదిరిగాడు. సీటు దక్కలేదన్న కోపంతో విమానం బయల్దేరడానికి 20 నిమిషాల ముందు నాసిక్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి విమానంలో బాంబు పెట్టినట్లు చెప్పాడు.

దీంతో కంగారుపడిన పోలీసులు విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు. బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో క్షుణ్నంగా తనిఖీ చేశారు. విమానం లోపల ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొన్ని గంటలు ఆలస్యంగా విమానం బయల్దేరింది. వీరేశ్‌ మొబైల్‌ నెంబరు ఆధారంగా అతడి లొకేషన్‌ను కనిపెట్టి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details