హైదరాబాద్ మహానగరంలో పెనుసవాల్‌గా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్సార్డీపీ పథకం ద్వారా పలు వంతెనలు, అండర్‌పాస్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పనులన్నీ పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు 29 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆ పరంపరలో 86 కోట్ల వ్యయంతో చేపట్టిన కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నేడు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ ఆర్వోబీ అందుబాటులోకి వస్తే హైటెక్ సిటీ నుంచి కూకట్‌పల్లి , జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వారికి ట్రాఫిక్ వెతలు తీరనున్నాయి. సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు 4 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గనుంది. ఉత్తమ్ నగర్, లాలాపేట్, తుకారాం గేట్, ఉప్పుగూడ లెవెల్ క్రాసింగ్, హైటెక్ సిటీ, ఆనంద్ బాగ్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతో రవాణా వ్యవస్థ మెరుగైంది. కైతాలాపూర్ ఆర్వోబీ నాలుగు లైన్లుగా..ప్రమాదాలకు తావు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లతో నిర్మించారు. పాదచారులు వంతెన దాటేందుకు వీలుగా ప్రత్యేక మెట్లు, సీసీకెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.