ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో... ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కరోనా వేళ వైద్య సేవలు నిలిపేసే విధంగా నిర్ణయం తీసుకోవడం... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే కారణంతో ఈ నెల 28న కడప నగరంలోని కొమ్మా ఆసుపత్రి, కేసీహెచ్ ఆసుపత్రిపై విజిలెన్స్ విచారణ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన కడప నగరంలోని 10 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల వద్ద..... బోర్డులు వెలిశాయి. కొవిడ్ కొత్త రోగులను చేర్చుకునేది లేదని బ్యానర్లు కట్టారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆఘమేఘాల మీద... ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. జిల్లా వైద్యాధికారులు, పోలీసు, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ అధికారులు... పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలు నిలిపి వేయడం మంచిది కాదని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే... కేసులు నమోదు చేయకుండా ఎలా ఉంటారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఆధారాలు,... బాధితుల స్టేట్ మెంట్లను వారి ముందుంచారు. ఈ క్రమంలో...ఎట్టకేలకు దిగొచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం పొరపాటు చేశామని ఒప్పుకున్నారు. క్షమించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని వైద్యులు కోరారు.